డిజిటల్ పేరుతో ఖజానా ఖాళీ చేసే..!

by Shyam |
డిజిటల్ పేరుతో ఖజానా ఖాళీ చేసే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కారణంగా ప్రభుత్వం రూ. వేల కోట్ల ఆదాయం కోల్పోయింది. అభివృద్ధి పనులకు బ్రేకులు వేయాల్సి వచ్చింది. దీన్ని అధిగమించేందుకు కృషి చేయాల్సిన పాలకులు, అధికారులు మరింత దివాలా తీసే విధంగా నిర్ణయాలను అమలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సరికొత్త విధానాలు, పారదర్శకత, అవినీతి నిర్మూలన, డిజిటలైజేషన్ పేరిట చేపట్టిన వినూత్న మార్గాలు బెడిసి కొడుతున్నాయి. అయినా కొందరు ఉన్నతాధికారులు తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్టుగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కొత్త మార్పులతో రూ. వేల కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని ప్రభుత్వ పెద్దలకు కొందరు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రతికూల వాతావరణంలోనూ డిజిటలైజేషన్, ఆన్లైన్ విధానాల అమలుకు సాహసించారని సమాచారం. రిజిస్ట్రేషన్లు ఎంతకాలం ఆపినా పరవాలేదు, వారంతా తిరిగి లావాదేవీలు కొనసాగిస్తారని కొత్త భాష్యం చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లు ఆగిపోయిన గత మూడు నెలల కాలంలో కొనుగోలు చేయాలనుకున్నవారంతా క్రయవిక్రయాలు మొదలు పెట్టగానే వచ్చేస్తారని అధికారులు అంచనా వేశారని, అదే అంశాన్ని పాలకుల ముందు ఉంచారని సమాచారం. రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాల నుంచి వచ్చే ఆదాయానికి ఎలాంటి గండిపడదని, పారదర్శకతతో మరింత రెవెన్యూ సమకూరుతుందని నమ్మబలికారని చెబుతున్నారు. కొత్త విధానాల ద్వారా ఏటా రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు ఉద్యోగవర్గాలలో ప్రచారం.

వీటిని మరిచారేం

కరోనా సమయంలో సమాజ ఆర్ధికాభివృద్ధి రేటును అధికారులు అంచనా వేయలేదు. ఉపాధి కోల్పోయిన రంగాలను లెక్కలోకి తీసుకోలేదు. కరోనాకు ముందు, తర్వాత సాఫీగా సాగుతోన్న రియల్ ఎస్టేట్ రంగానికి భరోసా లేకుండా చేశారన్న విమర్శలు ఉన్నాయి. మరో మూడు నెలలలో ఆర్ధిక సంవత్సరం ముగుసిపోతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వానికి సమకూరిన రెవెన్యూ ఎంత అనేది ఉన్నతాధికారుల లెక్కలకు అందడం లేదు. రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరే ఆదాయంలో 30 నుంచి 40 శాతం కూడా రాలేదని విశ్వసనీయంగా తెలిసింది. రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల సంఖ్యనే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కొందరి ఏకపక్ష నిర్ణయాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి పెద్ద గండి పడిందని. దీన్ని తిరిగి సమకూర్చుకోవడానికి కనీసం రెండేండ్లయినా పడుతుందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. పంతానికి పోయి ధరణిని అమలు చేయడం ద్వారా వాటిల్లుతున్న నష్టం అంతాఇంతా కాదన్నారు. ప్రభుత్వం మేల్కోనకపోతే రానున్న రోజుల్లో ఖజానాకు ధన ప్రవాహం ఆగిపోతుందన్నారు. ప్రజామోదం లేకుండా విధాన నిర్ణయాలు తీసుకోవడంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు కూడా నిరసనలు, ధర్నాలు కొనసాగాయి.

కూర్చున్న కొమ్మను నరికారు

రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఏటా రూ. ఎనిమిది వేల కోట్ల నుంచి రూ. పది వేల కోట్ల వరకు ఆదాయం సమకూరేది. గత ఆర్ధిక సంవత్సరం చివరి రెండు నెలలలోనూ నష్టం వాటిల్లింది. 2020-21 ఆర్ధిక సంవత్సరం మొదటి నుంచి ఇప్పటి వరకు కరోనా నుంచి ఏ రంగమూ పూర్తిగా కోలుకోలేదు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల పరిస్థితి కూడా అదే. డిసెంబరు వరకు జరిగిన లావాదేవీల సంఖ్య నాలుగు లక్షలు కూడా లేదని తెలుస్తోంది. సగటున ఏటా 12 లక్షల క్రయ విక్రయాలు జరుగుతాయి. అంటే ఇప్పటికే తొమ్మిది లక్షల డాక్యుమెంట్లు జరగాలి. ఈ ఏడాది కనీసం రూ. నాలుగు వేల కోట్ల ఆదాయం కూడా సమకూరడం కష్టమేనని కొందరు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి నెలా లక్ష లావాదేవీల వరకు జరిగేవి. పారదర్శకత, అవినీతి నిర్మూలన అంటూ మార్పులు చేయడంతో ఆదాయం పడిపోయింది. కొన్ని వేల మందికి ఉపాధి లేకుండా పోయింది. సవాలక్ష సాంకేతిక సమస్యలు, సందేహాలు ముందుకు వచ్చాయి. వ్యవస్థను పూర్తిగా నిలిపేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నకు ఏ అధికారీ సమాధానమివ్వడం లేదు. ప్రభుత్వం, అధికారులంతా కలిసి కూర్చున్న కొమ్మనే నరికేశారని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.

పడిపోతున్న ధరలు

రాజేంద్రనగర్​ నియోజకవర్గంలోని ఓ డివిజన్ నుంచి పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్ధి అప్పుల పాలయ్యారు. అవి తీర్చడానికి స్థిరాస్తులు అమ్మడం తప్ప మరో మార్గమేదీ లేదు. బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదు. దాంతో తన ప్లాటు అమ్మేందుకు సిద్ధమయ్యారు. మొన్నటి వరకు గజం రూ.14 వేల వరకు పలికేది. ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదు. రూ.11 వేలకే ఇస్తానంటున్నా ఎవరూ కొనేందుకు సిద్ధపడడం లేదు. ధరణి గందరగోళం నేపథ్యంలో రియల్​ ఎస్టేట్​రంగం పడిపోయే ఆస్కారం అవుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయం సమకూర్చుకోవడానికి మార్గాలు మూసుకుపోతున్నాయి. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకూ ధరణి పోర్టల్ వంటిదే అమలు చేయాలన్న పట్టుదల అధికార యంత్రాంగానికి ఎందుకో అర్ధం కావడం లేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిలోనూ అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేయడం ద్వారానే రిజిస్ట్రేషన్ చేశారు. ఆటోమెటిక్ మ్యూటేషన్ ప్రక్రియ మాత్రమే లేదు. పాత పద్ధతికి పంచాయతీరాజ్, పురపాలక శాఖలతో లింక్​ చేస్తే సరిపోతుంది కదా అని రియల్టర్లు ప్రశ్నిస్తున్నారు.

కార్డ్​ సృష్టికర్త ఎక్కడ?

ఉమ్మడి రాష్ట్రంలో అద్భుతమైన రిజిస్ట్రేషన్ల విధానం కార్డ్​ను సృష్టించిన అప్పటి జాయింట్​కమిషనర్ వేముల శ్రీనివాస్ ను టీఎస్​టీఎస్​ విభాగంలోని వార్ రూంకు బదిలీ చేశారు. సమర్ధుడిని సరికొత్త తెలంగాణ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రూపకల్పనలో భాగస్వామిని చేయకపోవడం పట్ల ఆ శాఖలోనే చర్చనీయాంశమైంది. ఆయన అభిప్రాయాలను కూడా స్వీకరించి ఉంటే జనం నుంచి విమర్శలు వచ్చేవి కావంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed