ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్లో మన వాటా ఎంత?

by Anukaran |   ( Updated:2021-06-10 11:22:52.0  )
joint Andhra Pradesh Property
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటై ఏడు సంవత్సరాలు పూర్తయినా ఇంకా ఉమ్మడి సంస్థల విభజన, ఆస్తుల పంపకాల ప్రక్రియ పూర్తికాలేదు. సత్వరం వాటిని పరిష్కరించే ఉద్దేశంతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి సంస్థల్లో ఇప్పటివరకు ఎన్నింటి విభజన పూర్తయింది, ఇంకా ఎన్ని కావాల్సి ఉంది, అందులో పనిచేస్తున్న ఉద్యోగులు రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ అయ్యారా లేదా, ఆస్తుల గుర్తింపు ఏ మేరకు పూర్తయింది.. ఇలాంటి వివరాలన్నింటినీ ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొమ్మిదవ, పదవ షెడ్యూళ్ళలో ఉన్న సంస్థల విభజన పురోగతి ఏ స్థాయిలో ఉంది, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండడానికి కారణాలేంటి తదితర వివరాలపై కూడా ఆరా తీశారు.

తొమ్మిదవ, పదవ షెడ్యూళ్ళలో ఉన్న సంస్థలకు సంబంధించిన భవనాలు, ఆస్తులు, అప్పులు, కేడర్ స్ట్రెంత్, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ఖాళీ పోస్టులు, కోర్టుల్లో ఉన్న వివాదాలు, ఇప్పటివరకు కేంద్ర హోంశాఖ మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చలు, రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన భిన్నాభిప్రాయాలు తదితరాలన్నింటిపైనా ఆయా శాఖల అధికారులు వివరణ ఇచ్చారు. అనంతరం కొన్ని హెచ్ఓడీల నుంచి వివరాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో సేకరించి పంపాల్సిందిగా ఆదేశించారు. పూర్తి డాటా వీలైనంత తొందరగా అందాల్సిందిగా నొక్కిచెప్పారు. పీఆర్సీ నివేదికలో ఉన్న వివరాలకు, ట్రెజరీ నుంచి ప్రతీ నెలా జరుగుతున్న చెల్లింపుల మధ్య తలెత్తిన వ్యత్యాసాన్ని కూడా ఈ సమావేశంలో మంత్రి ఆరా తీసినట్లు తెలిసింది.

తొమ్మిదవ షెడ్యూలులో ఉన్న 91 కార్పొరేషన్లలో రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేని 70 సంస్థలకు సంబంధించి షీలా భిడే కమిటీ గతంలోనే సిఫారసులు చేసింది. నిర్ణయాలు కూడా చేసింది. ఆ ప్రకారం ఉత్తర్వులు ఇచ్చుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. ఇక పదవ షెడ్యూలులోని 142 సంస్థలకు సంబంధించి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయిన ఆస్తులు మినహా ఇతర అంశాలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాలని నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ సంస్థల ఆస్తులను 42:58 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు సైతం గతంలో ఆదేశించింది.

తొమ్మిదవ షెడ్యూలులో 23 సంస్థల మధ్య ‘హెడ్ క్వార్టర్‘ నిర్వచనంపై సుప్రీంకోర్టు, కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరణతో ఆంధ్రప్రదేశ్ విభేదించడంతో అవి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ కాకుండా పెండింగ్‌లో పడ్డాయి. తొమ్మిదవ షెడ్యూలులోని సంస్థల ఆస్తులు, భూములు, ప్రస్తుతం వాటి విలువ తదితరాలన్నింటి వివరాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో పంపాల్సిందిగా అధికారులకు స్పష్టం చేశారు. ఇక పదవ షెడ్యూలులో దాదాపు 90 శాతం మేర సంస్థల మధ్య ఆస్తుల పంపిణీ పూర్తయింది.

రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, కార్మిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదిని, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, పర్యావరణ పరిశోధనా శాఖ డైరెక్టర్ జనరల్ అధర్ సిన్హా, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వివిధ విభాగాల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story