ఫీల్డ్ అసిస్టెంట్లను ఎందుకు తీసేసిన్రంటే ?

by Shyam |   ( Updated:2020-08-16 22:11:33.0  )
ఫీల్డ్ అసిస్టెంట్లను ఎందుకు తీసేసిన్రంటే ?
X

దిశ, షాద్ నగర్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వారంతా గ్రామాల్లోని పేదకుటుంబాలకు ఉపా ధి కల్పించేవారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్నవేళ వారే ఉపాధి కోల్పోయారు. ఈ పథకం కింద చేపట్టే కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించే క్షేత్ర సహాయకుల(ఫీల్డ్‌ అసిస్టెంట్‌–ఎఫ్‌ఏ)వ్యవస్థకు ప్రభుత్వం మంగళం పాడింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్ సైతం దాఖలైంది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్​మెంట్ గ్యారెంటీ స్కీమ్ 2005 యాక్ట్ ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు.

నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వ కుండా ఉద్యోగులను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాదాపు 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పిటీషన్ దాఖలు చేశారు. పెండింగ్​లో ఉన్న నాలుగు నెలల జీతం చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్‌లో కోరారు. 15ఏళ్లుగా అమలవుతున్న ఉపాధి హామీ స్కీంలో రాష్ట్ర సర్కారు కీలక మార్పులు చేసింది. గ్రామాల్లో పనుల ఎంపిక, జాబ్ కార్డుల జారీ, కూలీలకు పని కల్పన వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరి స్థానంలో పంచాయతీ కార్యదర్శులకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇకపై ఉపాధి హామీ పథకం అమలు, నిర్వహణ, నివేదికల సమర్పణ ప్రక్రియంతా వీరే నిర్వహించాల్సి ఉంటుంది. ఉపాధిహామీ పథకం మొదలైనప్పటి నుంచి క్షేత్రస్థాయిలో దాని అమలు తీరులో ఫీల్డ్‌ అసిస్టెంట్లదే కీలకపాత్ర.

సమస్యల కోసం సమ్మెచేస్తే..

‘కొండ నాలుక కు మందేస్తే ఉన్న నాలుక పో యిందన్న’ చందగా మారింది ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్య. సమస్యల పరిష్కారం కోసం సమ్మెచేస్తే ప్రభుత్వం ఉన్న ఉద్యోగం తీసేసింది. దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమను శాశ్వత ప్రాతిపదికన నియమించి వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో పాటు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దాదాపు 7,700 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు గతంలో సమ్మెకు దిగారు. ప్రభు త్వం లిస్ట్ 1, 2, 3గా విభజించి జీవో నెం. 4779 ద్వారా కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు కల్పించిన పని దినాలను బట్టి వారికి వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30దినాలు పని కల్పించిన వారికి రూ.10వేలు, 20 నుంచి 29రోజులు పని కల్పించిన వారికి రూ.9వేలు, 10నుంచి 19రోజులు పని కల్పించిన వారికి రూ.7,500 నెలకు చెల్లిస్తున్నారు. ఇది ఫీల్డ్ అసిస్టెంట్లకు గిట్టుబాటు కావడం లేదు.

దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు దిగారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు విధించిన 40 పని దినాల సర్క్యులర్‌ను రద్దు చేయాలని, షరతులు లేకుండా కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసవేతన చట్టం ప్రకారం రూ.21 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ సమ్మెకు అప్పట్లో ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరగడంతో సమ్మె నిలిచింది. అదేక్రమంలోనే ఫీల్డ్‌ అసిస్టెంట్ల బాధ్యతలను పూర్తిగా పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణనివ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఫీల్డ్‌ అసిస్టెంట్ల కథ ముగిసినట్లేనని స్పష్టమవుతోంది.

మా పొట్టకొట్టొద్దు : టేకుల శ్రీనివాస్, జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం కార్యదర్శి

15ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెం ట్ గా పనిచేసిన వారిని విధుల్లో నుంచి తొల గించి ప్రభుత్వం మా పొట్ట కొడుతుందని అనుకుంటలేము. రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లపై సానుకూలంగానే వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం. ఆలస్యమైనా తిరిగి విధుల్లోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సాను కూల దృక్పథంతో వ్యవహరిస్తుందని అనుకుంటున్నాం. ఒకవేళ విధుల నుంచి తొల గిస్తే మా రాష్ట్ర నాయకుల ఆదేశాల మేర కు కార్యాచరణ ప్రకటిస్తాం.

తొలగించడం బాధాకరం: మీసాల జగన్, ఫీల్డ్ అసిస్టెంట్, కేశంపేట మండలం

తోటి ఫీల్డ్ అసిస్టెంట్లు చాలామంది సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగిన, అధికారుల సూచనల మేరకు సమ్మెలో పాల్గొన్నకుండా విధులు నిర్వహించాను. అలాంటి వారిని కూడా కాం ట్రాక్టు అయిపోయిందంటూ విధులకు దూరంగా ఉంచడం ఎంతవరకు సమంజసం. ఆపద సమయం లో విధుల నుంచి తొలగించడం బాధాక రం. ఇప్పటికైనా ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed