కలిసొచ్చిన ఫిబ్రవరి.. భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు

by Harish |
కలిసొచ్చిన ఫిబ్రవరి.. భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వల్ల ఎదురైన సవాళ్ల నుంచి దేశీయ ఆటొమొబైల్ పరిశ్రమ కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజలు ఎక్కువగా వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో గత కొన్ని నెలలుగా కార్ల డిమాండ్ పెరిగింది. దేశీయంగా చాలావరకు కార్ల తయారీదారులు ఈ ఏడాది జనవరిలో అమ్మకాల వృద్ధిని నివేదించాయి. అదేవిధంగా ఫిబ్రవరిలో సైతం ఇదే ధోరణి కొనసాగింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి వాహనాల విక్రయాలు భారీగా పెరిగాయి.

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి 8.3 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో 1,33,702 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,44,761 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ఎస్‌యూవీ విభాగంలో 18.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే, ఎంట్రీ లెవల్, ఫ్లాగ్‌షిప్ సెడాన్ అమ్మకాలు తగ్గాయి. మరో ప్రముఖ సంస్థ బజాజ్ అమ్మకాలు 6 శాతం పెరిగాయి. 2020, ఫిబ్రవరిలో 3,54,913 యూనిట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 3,75,017 యూనిట్లను విక్రయించింది. దేశీయంగా మాత్రమే అమ్మకాలు 2 శాతం క్షీణించాయి. బజాజ్ టూ-వీలర్ అమ్మకాలు 7 శాతం పెరిగాయి. అయితే, కమర్షియల్ వాహనాలు 5 శాతం క్షీణించాయి. ఎగుమతులు 13 శాతం వృద్ధి చెందాయి. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు గతేడాది ఇదే నెలలో 10,352 యూనిట్లుగా నమోదవ్వగా, ఈసారి 14,075 యూనిట్ల అమ్మకాలతో ఏకంగా 36 శాతం వృద్ధి సాధించాయి. హ్యూండాయ్ అమ్మకాలు 26.4 శాతం పెరిగి 61,800 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో ఇవి 48,910 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీయ అమ్మకాలు 29 శాతం పెరిగాయి. ఎగుమతులు 14.6 శాతం పెరిగాయి.

టాటా మోటార్స్ దాదాపు 9 ఏళ్లలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. టాటా మోటార్స్ దేశీ అమ్మకాలు గతేడాది కంటే ఈ సారి ఫిబ్రవరిలో 54 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గతేడాది 38,002 యూనిట్లకు పరిమితం కాగా, ఈసారి 58,473 యూనిట్లను విక్రయించింది. కమర్షియల్ వాహనాల ఎగుమతులు 27 శాతం పెరిగాయి. ఎంజీ మోటార్స్ గతేడాది 1,376 యూనిట్లతో పోలిస్తే ఈసారి ఏకంగా 4,329 యూనిట్లను విక్రయించి మూడు రెట్ల వృద్ధిని సాధించింది. అషోక్ లేలండ్ విక్రయాలు 19 శాతం పెరిగాయి. గతేడాది 12,776 యూనిట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది 13,703 యూనిట్లను విక్రయించింది. టూ-వీలర్ దిగ్గజం టీవీఎస్ మోటార్ ఫిబ్రవరిలో అమ్మకాలు 18 శాతం పెరిగాయి. గతేడాది 2,53,261 యూనిట్లతో పోలిస్తే ఈసారి 2,97,747 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతులు 23 శాతం పెరిగి 1,01,789 యూనిట్లను విక్రయించింది.

Advertisement

Next Story

Most Viewed