నిర్వాసితుల నిర్వేదం

by Shyam |
నిర్వాసితుల నిర్వేదం
X

దిశ, మెదక్: ‘ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. వారి త్యాగం చిరస్మరణీయం. మీ రుణం తీర్చుకోలేనిది. ఒక్క కేసు లేకుండా భూసేకరణ చేపట్టాం’ అని అన్నారు, కానీ మా పరిస్థితి ఏంటి అంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లపూర్ గ్రామ శివారులో నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ శుక్రవారం రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటిఆర్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో మంత్రులు గొప్ప, గొప్ప ప్రగల్భాలు పలికారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేం.. భూ సేకరణలో ఒక్క కేసు లేకుండా ప్రాజెక్టును నిర్మించాం.. నిర్వాసితుల బాధలు మాకు తెలుసు అంటూ మంత్రులు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇదంతా బాగానే ఉన్నా ప్రాజెక్టులో భూములు కోల్పోతున్నా రైతులు తమకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్‌తో కోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు నుంచి స్టే…

చంద్లపూర్ గ్రామానికి చెందిన సురగోని పర్శరాములు గౌడ్, సురగోని శ్రీనివాస్‌గౌడ్, చెప్యాల వెంకటయ్యగౌడ్‌లకు సర్వే నెంబర్ 178, 179, 190 లలో 8 ఎకరాల 7 గుంటల యవసాయ భూమి ఉంది. ప్రస్తుతం 3 ఎకరాలలో వరిపంట సాగు చేస్తున్నారు. వరిపంట కోతదశకు చేరుకున్నది. తమ భూమికి 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2017లో (కేసు నెంబరు 27683) అప్పీల్ చేసుకున్నారు. తమ వ్యవసాయానికి విద్యుత్ తొలగించకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇది పట్టించుకోని అధికారులు రైతుల భూమి సేకరించకుండానే ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధం చేశారు. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా రెండు రోజుల ముందు ఆ రైతుల వ్యవసాయ బావులకున్న విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ స్తంభాలను జేసీబీల సహాయంతో ధ్వంసం చేసి తొలగించారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే శుక్రవారం ప్రాజెక్ట్‌లోకి నీళ్లు వదిలారు. ప్రాజెక్ట్ ప్రారంభ సమయంలో ఆ ముగ్గురూ రైతులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లో బంధించారు. ఉదయం 5 గంటలకు చిన్నకోడూరు పోలీసులు చంద్లపూర్ గ్రామానికి చేరుకొని ఆ రైతులను అదుపులోకి తీసుకుని సిద్ధిపేట రూరల్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో ఇదేంటని ప్రశ్నించిన హరీష్ అనే యువకుడిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు తమకు ఆహారం అందిచకుండా దేశ విద్రోహుల మాదిరిగా పోలీస్ స్టేషన్‌లో బంధించటంతో ఆ రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

అండగా నిలిచేవారికి కోసం ఎదురుచూపులు…

చేతికొచ్చిన పంట విద్యుత్ నిలిపివేయటంతో ఎండిపోయే స్థితికి చేరుకుందని, తమకు న్యాయం చేసేవారు లేరా అంటూ దీనస్థితిలో అండగా నిలిచే వారికోసం రైతులు ఎదురు చూస్తూన్నారు. ప్రాజెక్ట్ ప్రారంభంలో మంత్రులు భూములిచ్చిన రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అని చెప్పిన పదాలకు అర్థం ఇదేనేమో అని అనిపిస్తున్నది.

చట్టప్రకారం పరిహారం చెల్లించాలి: రైతు సంఘం జిల్లా కార్యదర్శి, చల్లారపు తిరుపతి రెడ్డి

ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణలో రైతులను ప్రభుత్వం మోసం చేసింది. 2013 చటం ప్రకారం తీసుకున్న భూమికి తిరిగి భూమి ఇవ్వాలి. కానీ, భూసేకరణ చట్టం నిబంధనలు తుంగలో తొక్కి బలవంతపు భూసేకరణ చేపట్టారు. రైతుల నిర్బంధించటం అన్యాయం. దీనిని రైతు సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం’

ఉగ్రవాదుల లెక్క బంధించారు: పరశురాములు, భూనిర్వాసితుడు(రైతు)

‘ప్రాజెక్టులోకి నీళ్లు వదులుతున్నామని సమాచారం ఇవ్వకుండానే మమ్మల్నీ పోలీస్ స్టేషన్ లో దేశ విద్రోహుల లాగా అరెస్ట్ చేసి నిర్బంధించారు. అంతేకాదు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని అంటున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి’

చెక్కులు ఇవ్వకుండానే నీళ్లొదిలారు: సుంకరి వెంకటేశం, నిర్వాసితుడు

ప్రాజెక్టు నిర్మాణం కోసం నాకున్న 11 ఎకరాల భూమి ఇచ్చినా. ఇప్పటికే తొమ్మిదిన్నర ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసిన. ఇంకా ఎకరంన్నర భూమి రిజిస్ట్రేషన్ చేయటానికి సిద్ధంగా ఉన్నా రిజిస్ట్రేషన్ చేయకుండానే, నష్టపరిహారం చెక్కులు ఇవ్వకుండానే డ్యాంలోకి నీళ్లు వదిలారు’

Tags: medak, ranganayaka project, farmers, court, petition

Advertisement

Next Story

Most Viewed