మాకు దిక్కెవరు..?

by Shyam |
మాకు దిక్కెవరు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘నా ఎకరన్నర భూమిలో సన్నరకం వరి పంట వేశాను. రైతుబంధు సాయంతో పాటు రూ. 20 వేల అప్పు చేసి పంట సాగు చేశాను. అకాల వర్షంతో ఎకరన్నర భూమిలో వేసిన వరి పంట పూర్తిగా నేలమట్టం అయింది. ఈ వానాకాలం వ్యవసాయాధికారులు చెప్పిన పంట వేశాను. కానీ చేతికి రాకుండా పోయింది. మా పెట్టుబడి అంతా నీళ్లలో కలిసినట్టేనా…?. ఇప్పుడు పరిహారం ఇవ్వకపోతే మాలాంటి రైతులకు చావే దిక్కవుతోంది.’ ఇది వరంగల్ జిల్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన చీకుర్తి వీరస్వామి అనే రైతు వేదన.

‘అయ్యా కేసీఆర్ సారూ మా రైతుల బాధలు పట్టవా… మొదటి గింజ నుంచి చివరి గింజ వరకూ కొంటామని మాటలు చెప్తిరి. ఇప్పుడేమో వర్షాలతో పంట నాశనమైంది. ఎంతో కొంత మిగిలిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే మాతరం కావడం లేదు. మాదగ్గర దాన్యం కొనడానికి వచ్చినోళ్లు తరుగుతోనే సగం తింటున్నరు. వ్యవసాయం చేసినందుకు ఏడుస్తూనే ఉన్నం. ఇది ఇలాగే కొనసాగితే రైతుల ఆత్మహత్యలు ఆగవు. అయ్యా కేసీఆర్ సారూ… ఇప్పుడైన కండ్లు తెరవండి.’ ఇది వరంగల్ జిల్లాకు చెందిన కందుల వసంత అనే మహిళా రైతులు ఆవేదన. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా లేఖ రాశారు.

తెగుళ్లతో మరింత భారం

బీటీ పత్తి సాగుచేస్తే తెగుళ్లు రావని, పురుగుమందుల ఖర్చు తగ్గుతుందనేది ఆశించినా ఈ సీజన్‌లో గులాబీ రంగు పురుగుతో పాటు దోమ, ఆకుముడత, పేనుబంక వంటి తెగుళ్లు పత్తి పైరును నాశనం చేస్తున్నాయి. కొందరు రైతులు ఇప్పటికే వేలాది రూపాయలు అప్పు చేసి 4 నుంచి 7 సార్లు పురుగుమందులు పిచికారీ చేశారు. ఖరీఫ్‌లో పంటలకు ఖర్చుల వివరాలను, మద్దతు ధరలపై సిఫార్సులతో కమిషన్‌కు నివేదించాయి. సగటున ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, క్వింటా పత్తి పండించడానికి సగటున రూ.5608 ఖర్చవుతుందని తెలంగాణ రాష్ట్రం నుంచి నివేదించారు.

తిండి కూడా కరువే

వరుసగా కురిసిన వానలతో రైతులు అతలాకుతలమయ్యారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 24 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. నియంత్రిత సాగు విధానంలో సాగు చేసిన వరి సన్నాలు, పత్తికే ఎక్కువ ప్రమాదం వాటిల్లింది. కానీ నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే అంశంపై ఇప్పటికీ ప్రభుత్వం మాటెత్తడం లేదు. దీంతో దేశానికి తిండి పెట్టే రైతుకు ఇప్పుడు బుక్కెడు బువ్వ కూడా దొరకని పరిస్థితి నెలకొంది.

అప్పులు తీరవు : మహ్మద్ రోషన్ అలీ, తొర్రూర్

నాకున్న రెండుఎకరాల పత్తి వేశాను.ప్రారంభంలో పత్తి చేను బాగుంది. మంచి కాత సమయంలో వర్షం వరుసగా పడటంతో ముడతరోగం, జాజురోగంతో చేను ఎర్రబారీ పోయింది. పువ్వు నిలువలేదు. చెట్టుకు నాలుగు కాయలు వచ్చినయి. మొదటి విడతలో ఒక్క క్వింట పత్తి వచ్చింది. రెండు ఎకరాలకు ముప్పై వేల పెట్టుబడి అప్పు తెచ్చి పెట్టాను. వర్షంతో పెట్టుబడిరాకపోవంతో పాటు అప్పులు తీరవు. నష్ట పరిహారం కూడా ఇస్తారో ఇవ్వరో తెల్వదు.

కొత్త రోగంతో వరి దిగుబడి వచ్చే అవకాశం లేదు : ఎడవెల్లి సొములయ్య, పాలకుర్తి

వరి పంట పొట్టకు వచ్చిన సమయంలో వర్షాలు రావడంతో కొత్త రోగం వచ్చింది. వరి కాండం నుండి రోగం రావడంతో వరితాలు పడుతుంది. ఈసారి వచ్చిన వానలతో పంట దిగుబడి తగ్గుతోంది. ప్రభుత్వం చెప్పిన పంట వేసినం. అందుకే అదుకుని నష్టపరిహారం ఇవ్వాలి.

వర్షానికి మొత్తం పోయింది : అన్నవేన రాజు, యువ రైతు, వెంకటాపూర్

నెల కిందట కురిసిన అకాల వర్షాలతో నాకున్న రెండు ఎకరాల్లో వరి పొలం పూర్తిగా కొట్టుకుపోయింది. వ్యవసాయ శాఖ అధికారులు వస్తారనుకున్న. కానీ ఎవరూ రాలేదు. సర్వే నిర్వహించి ఇప్పటికైనా నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పటికే రెండు ఎకరాల పంటలో సుమారు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టిన.

Advertisement

Next Story

Most Viewed