పంజాబ్‌లో రైల్‌ రోకో విరమణ

by Shamantha N |
పంజాబ్‌లో రైల్‌ రోకో విరమణ
X

చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో ఎట్టకేలకు రైతులు వెనక్కి తగ్గారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కొన్ని వారాలుగా చేపడుతున్న రైల్ రోకోను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. శనివారం పంజాబ్ సీఎం అమరీందర్‌ సింగ్‌తో భేటీ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 రోజుల గడువు ఇచ్చామని, తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మళ్లీ రైల్ రోకో చేపడుతామని హెచ్చరించారు.

రైతుల ఆందోళన విరమణతో సోమవారం రాత్రి నుంచి ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగనున్నాయి. రైతు సంఘాల నిర్ణయాన్ని సీఎం అమరీందర్ సింగ్ స్వాగతించారు. రాష్ట్రంలో అన్నిరకాల రైల్వే సేవలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.‘ఆహ్లాదకర వాతావరణంలో రైతు సంఘాల నేతలతో చర్చలు జరిగాయి. ఈ నెల 23 రాత్రి నుంచి రాష్ట్రంలో రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగనున్నాయి. రైతుల నిర్ణయంతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది’ అని అమరీందర్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ పంజాబ్‌లో రైతులు ఆందోళన బాట పట్టారు. గత కొన్ని వారాలుగా 20కిపైగా చోట్ల జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌లను దిగ్బంధం చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో రైల్వే సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా గూడ్స్ రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో అత్యవసర వస్తువుల సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది.

Advertisement

Next Story

Most Viewed