భూమిని తొలగించారు.. కలెక్టర్ స్పందించాలి..

by Shyam |
భూమిని తొలగించారు.. కలెక్టర్ స్పందించాలి..
X

దిశ, చిట్యాల: అధికారుల నిర్లక్ష్యంతో భూమిని తొలగించారంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం రైతులు ధర్నాకు దిగారు. తమ వ్యవసాయ భూముల చుట్టూ 100 ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి ఎస్సారెస్పీ కెనాల్ లేదని చెప్పినా భూమిని తొలగించారని ఆరోపించారు. ఈ సందర్భంగా కైలాపూర్ గ్రామానికి చెందన రైతు చింతల వెంకటయ్య, అతని కుమారుడు శైలేందర్ మాట్లాడుతూ.. కైలాపూర్ గ్రామ శివారు 43 సర్వే నంబర్ తమకు 2.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. వాటిని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సాదాబైనామా భూప్రక్షాళనలో నూతన పట్టా పాస్ బుక్ సైతం వచ్చిందని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం ములంగా కెనాల్ కాలువ కింద 9 గుంటల భూమిని తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ధరణిలో 2.11 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే చూపిస్తుందని మిగతా తొమ్మిది గుంటల భూమి ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. దీనిపై గత ఆరు నెలల క్రితం భూసర్వే కోసం దరఖాస్తు చేసుకున్నామని ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి వచ్చిన దాఖలాలు లేవన్నారు.

గత నాలుగు రోజుల క్రితం చిట్యాల తహసీల్దార్ రామారావు‌కు సైతం ఫిర్యాదు చేశామన్నారు. ఆయన దీన్ని సరి చేయడానికి ధరణిలో ఎలాంటి అనుమతులు లేవని చెప్పారన్నారు. ఇక ఏమి చేయాలో పాలుపోక ధర్నా చేస్తున్నామని బాధితులు చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య స్పందించి తమకు, కెనాల్ కాలువ కింద భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నాకు ఏఐఎఫ్‌బి జిల్లా నాయకులు ముఖిరాల మదువంశీ కృష్ణా, కార్యకర్తలు మద్ధతు తెలిపారు. రైతుల కోసం ఎలాంటి పోరాటాలు అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు భరోసా కల్పించారు.

Advertisement

Next Story