మీరు చేసిన తప్పులకు మేమెందుకు బలి కావాలి..? అధికారులను నీలదీసిన బాధితులు

by Sridhar Babu |   ( Updated:2021-10-23 00:52:35.0  )
Shadh-Nagar-Land1
X

దిశ, షాద్ నగర్: ధరణి పోర్టల్ రైతుల పాలిట అద్భుతవరం అని ప్రభుత్వం చెప్తున్నా.. అధికారులు, సిబ్బంది చేస్తున్న తప్పిదాల కారణంగా రైతులు మాత్రం అరిగోస పడుతున్నారు. ధరణి రికార్డుల్లో గల్లంతు అవుతున్న భూమి, తప్పిదాలు సరిచేసుకునేందుకు ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని బాధితులు వాపోతున్నారు. అధికారులు, సిబ్బంది చేసిన పొరపాట్లు, నిర్లక్ష్యానికి తామెందుకు బలికావాలని ప్రశ్నిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా తమ చేతిలో ఏమిలేదని.. ధరణిలో దరఖాస్తు చేసుకోండి.. సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఎమ్మార్వోలు చెబుతున్నారని, సంవత్సరాలు గడిచినా సమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదని రైతులు వాపోతున్నారు. అధికారులు రికార్డులు రాయడంలో చేస్తున్న తప్పిదాలకు తాము శిక్షను అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు.

షాద్ నగర్ నియోజకవర్గంలో కేశంపేట, ఫరూక్ నగర్, నందిగామ, కొత్తూరు, కొందుర్గు, చౌదరి గూడెం మండలాలు ఉన్నాయి. ఇక్కడ ఈ మధ్య కాలంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో అధికారుల తప్పిదాలు వల్ల రైతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తోంది. కేశంపేట మండల పరిధిలోని పోమాల్ పల్లి గ్రామానికి చెందిన కర్నెకోట కసాబ్ కిషన్ సర్వే నెంబర్ 247/ఆ4 లో 7గుంటలు,247/ఆ/ఆ లో 4 గుంటలు 2020 డిసెంబర్లో ఇతరులకు విక్రయించాడు. అయితే ఆన్ లైన్ రికార్డులలో విక్రయించిన ఈ సర్వే నెంబర్లతో పాటు 205/ఈ లో 16 గుంటలు, 206/అ లో 1ఎకరా 2గుంటలు సర్వే నెంబర్లు కూడా తొలగించారు. తొలగించిన భూమిని తిరిగి ఎంట్రీ చేయాలంటూ ఎమ్మార్వో, కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఇలాంటి ఎన్నో సమస్యలను రైతులు నిత్యం ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. ధరణి పోర్టల్ భూముల విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు రావడం, సర్వే నెంబర్లు మిస్ అవడం, పట్టాభూములు నిషేధిత జాబితాలో చేరడం, వివిధ కారణాలతో డిజిటల్ సిగ్నేచర్ కాకపోవడంతో పాస్ బుక్ జారీలో అంతరాయం వంటి ఎన్నో సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

అధికారుల తప్పిదాల వల్ల మాకెందుకు శిక్ష: కర్నెకోట కసాబ్ కిషన్ (రైతు)

అధికారులు రెవెన్యూ రికార్డుల నమోదులో చేస్తున్న తప్పిదాల కారణంగా మేం శిక్ష అనుభవిస్తున్నాం. సరిచేయమంటే మాచేతుల్లో లేదని ఎమ్మార్వోలు అంటున్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగొద్దనే ప్రభుత్వం ధరణిని తెస్తే అధికారులు తప్పిదాలు చేస్తూ సంవత్సరాల పాటు కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed