- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్.. గ్రేట్ ధరణిలో కేసీఆర్‌కు తెలియని సమస్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ‘మా బంధువు భూమిని రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో పెట్టారు. ఏ కారణంతో పెట్టారో తెలుసుకునేందుకు ఆపసోపాలు పడాల్సివచ్చింది. సింగూరు ప్రాజెక్టు కింద కొంత భూమి పోయింది. అందులో ఇదీ ఉందని అధికారులు చెప్పారు. ఏ భూములు తీసుకున్నారో, ఎవరికి నష్టపరిహారం ఇచ్చారో వారి దగ్గరే సమాచారం ఉంటుంది. ఇతడి భూమిని ప్రభుత్వం తీసుకోలేదు. కానీ అదే సర్వే నంబరులోని కొంత సేకరించారు. ఐతే మొత్తం సర్వే నంబరును పీఓబీలో పెట్టారు. ఇప్పుడు తొలగించాలంటూ దరఖాస్తు చేస్తే సింగూరు ప్రాజెక్టు కింద భూ సేకరణ జరిపినప్పటి నోటిఫికేషన్ గెజిట్ తీసుకురావాలని అడుగుతున్నారు. అదెలా సాధ్యం? అది వాళ్ల దగ్గరే ఉంటుంది కదా. దరఖాస్తుదారుడిని అడగడం ఏమిటి? ఆర్నెళ్ల నుంచి దరఖాస్తును పట్టించుకోవడం లేదు’.. ఇది ప్రభుత్వ శాఖలో పని చేస్తోన్న సెక్రటరీ స్థాయి అధికారి ఆవేదన.
10 నెలలుగా రైతు మెడకు ‘ధరణి’ పాము చుట్టుకున్నది. కరవడానికి సిద్ధంగా ఉన్నది. భూమి ఉన్నోళ్లల్లో సగం మంది ఏదో ఓ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చేతిలో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నా భూమి హక్కులు ప్రశ్నార్థకంగా మార్చారు. తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం- 2019, ధరణి పోర్టల్ అమలైన నాటి నుంచి ప్రతి పల్లె పంచాయతీలతో కొట్టుమిట్టాడుతున్నది. గతేడాది సెప్టెంబరు నుంచి లక్షలాది ఫిర్యాదులతో తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాలు నిండిపోయాయి. ఆన్‌లైన్ ఫిర్యాదులు కుప్పలుతెప్పలుగా వస్తూనే ఉన్నాయి. 30 రకాల మాడ్యూల్స్ ద్వారా లక్షలాదిగా వచ్చాయి. ఎన్నేసి దరఖాస్తులు వచ్చాయి? ఎన్నింటిని పరిష్కరించారు? అన్న డేటాను కూడా అత్యంతగోప్యంగా ఉంచుతున్నారు. ఆఖరికి ఎవరైనా సమాచార హక్కు చట్టం కింద అడిగినా.. నెలలు గడిచినా ఉలుకూపలుకూ లేదు. అందిన దరఖాస్తుల్లో కనీసం 10 శాతం పరిష్కరించిన దాఖలాలు లేవని విశ్వసనీయ సమాచారం.
99 శాతం డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్ అని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. అందుకే 1.47 కోట్ల ఎకరాలకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామంటున్నారు. కానీ ఆ రైతుబంధుకు అర్హులైన లక్షలాది మంది రైతుల భూములు వివాదాస్పదంగా మార్చిన ఘనత రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకే దక్కుతుంది. వారందరికీ ప్రతి ఏటా ప్రభుత్వం సాయం అందిస్తోంది. కానీ వారి భూములను మాత్రం ధరణి పోర్టల్ డేటాలో వివాదాస్పదంగా చూపిస్తున్నారు. పథకానికి అర్హత సాధించినప్పుడు వివాదం ఉందని ఎలా నమోదు చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.
ప్రధానంగా నిషేదిత జాబితాల్లో పొరపాట్లు, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం తక్కువగా నమోదు చేయడం, ఒకరి భూమిని మరొకరి పేరిట రికార్డు చేయడం వంటి అనేక సమస్యలు ఉన్నాయి. అలాంటి దరఖాస్తులే లక్షల్లో వచ్చాయి. ఇంకా భూ లావాదేవీలు అవసరం పడని లక్షలాది మంది రైతులు ధరణి పోర్టల్ లో వారి డేటాను చెక్ చేసుకోలేదు. 100 శాతం రైతుల డేటాలో ఇంకెన్ని వింత ప్రపంచాలను చూడాల్సి వస్తుందోనని అధికారులు విస్తుపోతున్నారు. ప్రగతి భవన్ లోని సీనియర్ ఐఏఎస్ అధికారులు ధరణి పోర్టల్ అమలైన తర్వాత పరిస్థితులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం లేదని ఓ అధికారి చెప్పారు. ఏడాది కాలంగా భూ పరిపాలన 100 శాతం బాగుందంటూ సీఎం కేసీఆర్‌కు తప్పుడు నివేదికలు సమర్పిస్తుండడం వల్లనే పరిష్కార మార్గాల అన్వేషణ కొనసాగడం లేదన్నారు.
రైతులకెందుకీ కష్టం..
ప్రభుత్వం ధరణి పోర్టల్ అమలు చేసి సాంకేతిక విప్లవానికి నాంది పలికినట్లు ప్రచారం చేస్తోంది. ఎక్కడైనా ఏదైనా మార్పును తీసుకొస్తే మెరుగైనా సేవలందించేటట్లుగా ఉండాలి. రిజిస్ట్రేషన్ల సర్వీసులు మినహా మరే ఇతర అంశాల్లోనూ పాత విధానాల కంటే మెరుగైనది కాదని రెవెన్యూ చట్టాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ డేటాను ఇష్టారాజ్యంగా అప్ లోడ్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చట్టం 22ఎ కింద నమోదు చేసేటప్పుడు గ్రామ సభ అనుమతి తీసుకోవాలి. అలాంటి ప్రక్రియ చేపట్టకుండానే అందుబాటులో ఉన్న డేటాను ధరణి పోర్టల్ నమోదు చేశారు. ఇక తన్నుకు చావండంటూ అధికారులు వ్యవహరిస్తున్నారు.
ఆఖరికి భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత కూడా అనేక సర్వే నంబర్లను ప్రొహిబిటేడ్ ఆర్డర్ బుక్(నిషేధిత రిజిస్ట్రేషన్ల ఆస్తుల జాబితా)లో నమోదు చేశారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకం ఉంటే డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్‌గా అధికారులు ప్రకటించారు. కానీ, ఇప్పుడదీ పనికి రాకుండా పోయింది. ఆన్ లైన్ కు వెళ్లి పరిశీలించుకుంటే తప్ప వివాదరహితమైనదిగా గుర్తించలేని దుస్థితి నెలకొంది. వీటిని ఆసరాగా చేసుకొని కొందరు కలెక్టర్లు అవసరం లేని పత్రాలను అడుగుతూ కాలయాపన చేస్తున్నారు. ఇంకొందరేమో ధరణి దరఖాస్తులను పరిశీలించడానికే ఆసక్తి చూపడం లేదు. ఎవరైనా వస్తే కోర్టుకే వెళ్లండంటూ సలహాలిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు.
ఒక్క సంతకంతో చేయొచ్చు..
సాగు భూముల క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ల శాఖ ఆధీనంలో ఉన్నప్పుడు అనేక నిషేధాలు అమల్లోకి తీసుకొచ్చారు. ఎవరైనా సదరు భూమిపై తమకు అభ్యంతరం ఉందని, రిజిస్ట్రేషన్ చేయొద్దని దరఖాస్తు చేసుకుంటే చాలు.. వాటిని పీఓబీలో జాబితాలో నమోదు చేశారు. సీబీఐ, సీఐడీ, ఆదాయపు పన్నుల శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసిన భూములన్నింటినీ చేర్చారు. అలాగే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే వాటిని కూడా అదే జాబితా కింద పరిగణించారు. ఐతే ఇందులో ఏదైనా సర్వే నంబరులో కొంత పార్టు లేదా ఏదైనా ఒక సబ్ డివిజన్ పై అభ్యంతరాలు ఉన్నాయి. కానీ ధరణి పోర్టల్‌లో మాత్రం సబ్ డివిజన్ల వారీగా రిజిస్ట్రేషన్లను నిషేదించడం సాధ్యం కావడం లేదు. ఏ సబ్ డివిజన్ పైనా అభ్యంతరాలు ఉన్నప్పటికీ సదరు సర్వే నంబరులోని మొత్తం భూమి పీఓబీలో కనిపిస్తోంది.
అలాగే పాక్షిక భూమిపైన కోర్టు కేసు ఉందనుకోండి. ఆ సర్వే నంబరు మొత్తానికి లాక్ చేశారు. అలాగే ఐటీ, సీబీఐ, సీఐడీ, బ్యాంకుల నుంచి సదరు వివాదాలు పరిష్కారమైనా ఆ యా శాఖల నుంచి నిరభ్యంతరాల పత్రాలు అందకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. వీటన్నింటినీ ఒక్క ఉన్నతాధికారి సంతకంతో సరిదిద్దే అవకాశం ఉంది. అది చేయకుండా లక్షలాది మంది రైతులను ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ.. ఆఖరికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ, టీఎస్టీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారు.
గంటలో 250 మంది..
ధరణి పోర్టల్ వల్ల ఇబ్బందులను తెలుసుకుందామని సామాజిక కార్యకర్త మన్నె నర్సింహారెడ్డి వాట్సాప్‌ను క్రియేట్ చేశారు. లింక్ షేర్ చేస్తే గంటలోపే 256 మంది చేరారు. అలాగే ఫేస్ బుక్‌లో ధరణి భూ సమస్యలు అని గ్రూపు ఏర్పాటు చేస్తే ఒక్క రోజులోనే వందల్లో వచ్చారు. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన సమస్యను చెబుతున్నారు. 99 శాతం డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్‌గా అభివర్ణిస్తున్న ప్రభుత్వం దీనికి కారణాలను మాత్రం వెతకడం లేదు.
ఎంత అన్యాయం?..
తన పెద్ద నాన్న భూమిని తన పేరు మీద చూపిస్తుంది అని తెలిసి, స్వచ్ఛందంగా వాళ్ళ పేరు మీద మార్చడానికి ప్రయత్నిస్తే, కొంత భూమి వేరే రైతు మీద చూపిస్తుంది. దీన్ని మార్చాలంటూ ఏడాదిగా తిరుగుతున్నా. లాయర్ దగ్గరికి వెళ్లి నోటరీ చేసుకురావాలన్నారు. అది కూడా ఇచ్చా. ఐతే మేలు చేయాలనుకున్న నా భూమిని తొలగించారు. నాకు ఉండాల్సిన 1.06 ఎకరాలు వేరే వారి పేరిట రాశారు. మా పెద్ద నాన్నకు రావాల్సిందీ పెండింగులోనే పెట్టారు. ఇది యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం రైతు ఆవేదన. స్వచ్ఛందంగా తనది కాని భూమిని హక్కుదారుల పేరిట రాయాలన్న రైతును కూడా ఇక్కట్లకు గురి చేశారు. సర్వే నంబరు 115, 116 ల్లో భూములను మార్చి రాశారు. సమస్యనా ? అధికారుల తప్పిదమా ? అధికారులే చెప్పాలి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ గ్రామంలో వందలాది ఎకరాల భూమి హక్కులు మారాయి.
2019లో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు రెండెకరాల భూమిని కొనుగోలు చేశారు. రైతు పేరిట కొత్త పాసు పుస్తకం ఉంది. అలాగే ధరణి పోర్టల్‌లో పరిశీలిస్తే వారి పేరిటే ఉంది. ఆఖరికి ఆన్ లైన్‌లో పహాణీ తీసుకున్నారు. దేవరకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత మ్యుటేషన్ అయ్యింది. కొన్న వారికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇంటికే వచ్చాయి. ఇప్పుడు వీళ్లు అమ్మడానికి వెళ్తే అది ప్రభుత్వ భూమిగా చూపిస్తున్నది. ఇక్కడెవరిది తప్పు? అధికారులదా? రైతుదా? కొన్నవారిదా? ధరణి డేటాను విశ్వసించి భూమిని కొనుగోలు చేసిన వారికీ చుక్కలు చూపిస్తున్నారు.