రోడ్డెక్కిన రైతులు.. మిల్లర్లు కుమ్మక్కై మోసం చేస్తున్నారంటూ ఆవేదన

by Shyam |   ( Updated:2021-11-24 01:11:45.0  )
రోడ్డెక్కిన రైతులు.. మిల్లర్లు కుమ్మక్కై మోసం చేస్తున్నారంటూ ఆవేదన
X

దిశ, దేవరుప్పుల: దేవరుప్పుల మండలంలోని సింగరాజుపల్లి స్టేజీ వద్ద అధికారులు మిల్లర్లు కుమ్మక్కై క్వింటాల్‌కు పది కిలోలు కట్ చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారని, ఈ దోపిడీని వెంటనే అరికట్టాలని జనగామ సూర్యాపేట రహదారిలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను మిల్లర్లు, అధికారులు కలిసి కుమ్మక్కై నిలువు దోపిడీ చేస్తున్నారని, తేమ పేరుతో రైతులను నిలువునా ముంచడం సబబు కాదని అన్నారు. గంటసేపు జనగామ సూర్యాపేట జాతీయ రహదారిని నిర్భందించారు. తక్షణమే వరి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు లేకుండా మిల్లర్ల దోపిడీని అరికట్టాలని కోరుతూ మండల తహసీల్దార్ శ్రీనివాస్‌కు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. త్వరగా కొనుగోలును ప్రారంభించి ధాన్యాన్ని కట్ చేయకుండా చూడాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story