పంట అమ్మేందుకు వచ్చి.. ప్రాణాలు వదిలిన రైతు

by Sumithra |
పంట అమ్మేందుకు వచ్చి.. ప్రాణాలు వదిలిన రైతు
X

దిశ, దుబ్బాక : తాను పండించిన వరి ధాన్యాన్ని మార్కెట్లో విక్రయించేందుకు వచ్చి ఓ రైతు అక్కడే మృతి చెందిన ఘటన దుబ్బాకలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన మ్యాక పర్శయ్య (55) అనే రైతు వ్యవసాయ పొలంలో పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు దుబ్బాక మార్కెట్ యార్డుకు వచ్చాడు. గత మూడు రోజుల నుంచి అక్కడే ఉండి ధాన్యానికి కాపలా ఉంటున్నాడు. కరోనా టైం, ఆపై ఎండలు దంచికొడుతుండటంతో వేడిమి తట్టుకోలేక మార్కెట్ యార్డ్‌లోనే రైతు పర్శయ్య మృతి చెందాడు.

చెట్టు నీడకు పడుకొని ఉన్న పర్శయ్యను అన్నం తింటాడేమో అని పక్కనే ఉన్న రైతులు లేపగా ఎంతకూ పలకలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న వారు రైతును పరిశీలించగా మృతి చెందినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ధాన్యం అమ్మకుండానే అదే మార్కెట్ యార్డులో రైతు ప్రాణం కోల్పోవడం చూసి అక్కడికి వచ్చిన రైతులు కన్నీరు పెట్టుకున్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తోటి రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed