స్ట్రీట్ డాగ్ యూకే జర్నీ..

by Shyam |
స్ట్రీట్ డాగ్ యూకే జర్నీ..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ శునకం రైలు పట్టాల మీద రక్తమోడుతూ, కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. అప్పుడే అక్కడకు వచ్చిన ఆరీపీఎఫ్ కానిస్టేబుల్ చంద్రపాల్ తన్వార్ ఆ కుక్క పరిస్థితిని చూసి చలించిపోయాడు. ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌కు తరలించడంతో ఆ కుక్క ప్రాణాలతో బయటపడింది. అయితే ఈ సంఘటన జరిగి ఏడాది అయిపోయింది. కాగా ప్రస్తుతం ఆ శునకం యూకేకు వెళ్లనుంది.

ప్రతి ఒక్కరికీ జీవితం రెండో అవకాశం ఇస్తుంది. మూడేళ్ల వీధి కుక్క ‘రాకీ’ విషయంలోనూ ఇదే జరిగింది. అక్టోబర్, 2019లో ఫరీదాబాద్‌లోని బల్లాభార్హ్ రైల్వే ట్రాక్ మీద రాకీని ట్రైన్ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో దాని నాలుగు కాళ్లకు గాయాలై తీవ్ర రక్తస్రావం జరిగింది. అయితే తన్వార్ దాన్ని ‘పీపుల్ ఫర్ ఎనిమల్ ట్రస్ట్’‌కు తీసుకెళ్లి ప్రాణాలు కాపాడగలిగాడు. ప్రాపర్ కేర్, నర్సింగ్ సాయంతో రాకీ త్వరగానే కోలుకున్నప్పటికీ దాని రెండు కాళ్లను మాత్రం కోల్పోయింది. దాంతో రాకీకి ప్రొస్థెటిక్ కాళ్లు అమర్చడంతో ప్రస్తుతం హ్యాపీగా వీధుల్లో తిరుగుతూ, చక్కగా ఆహారం తింటోంది. కాగా రాకీ రికవరీ స్టోరీని ‘పీపుల్ ఫర్ యానిమల్’ ట్రస్ట్ వీడియోగా రూపొందించింది. తరచుగా జంతువులు అనేక ప్రమాదాలకు గురవుతుండగా, వాటిని ఎవరూ పట్టించుకోని సందర్భాల్లో ప్రాణాలు విడుస్తున్నాయని, వాటిని కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉందనే సందేశం ఇచ్చేలా ఆ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, వెంటనే వైరల్ అయ్యింది. ఇంగ్లాండ్, కాట్స్‌వోల్డ్స్‌లో నివసించే ఓ జంట ఈ వీడియోను చూసి ‘రాకీ’ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చింది.

రాకీ బుధవారం (నవంబర్ 18)రోజున యూకే ఫ్లైట్ ఎక్కనుంది. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. రాకీకి రేబిస్ టెస్ట్ కూడా నిర్వంచారు. అంతేకాదు యూకే యానిమల్ డిపార్ట్‌మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది. సో.. రాకీ ఇక యూకేలోని తన కొత్త ఇంట్లో ఆత్మీయుల మధ్యన సంతోష జీవితం గడపబోతుంది. రాకీకి అంతా మంచే జరగాలని మనమూ కోరుకుందాం.

Advertisement

Next Story

Most Viewed