ఎక్స్‌-గర్ల్‌ఫ్రెండ్‌ ఫేర్‌వెల్!

by Sujitha Rachapalli |
ఎక్స్‌-గర్ల్‌ఫ్రెండ్‌ ఫేర్‌వెల్!
X

దిశ, వెబ్‌డెస్క్: వదిలేసి పోయిన అమ్మాయి మీద ద్వేషాన్ని పెంచుకుని, ఆమె జీవితాన్ని నాశనం చేయాలనుకునే అబ్బాయిలు ఉంటారు. కానీ, ఆమె వదిలి వెళ్లడానికి గల కారణాలను అర్థం చేసుకుని, ఆ విడిపోయేదేదో ఒకరినొకరు ప్రేమిస్తూ విడిపోతే బాగుంటుందని ఆలోచించే అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉంటారు. అమ్మాయి దూరమయ్యాక ఆమెతో ఈ విషయాన్ని పంచుకునే అవకాశం దొరకడం చాలా అరుదు. అలాంటి అవకాశాన్ని సృష్టించుకోవడానికి ఇప్పుడొక దారి దొరికింది. ఇలాంటి ఒక దారి ఉందని మనకు తెలియజేసిన వ్యక్తి పేరు భార్గవ్. ఇలా భార్గవ్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. భార్గవ్‌రైట్స్ అందాం. అప్పుడు గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇంతకీ ఎవరీ భార్గవ్‌రైట్స్? ఇక్కడ తెలుసుకుందాం.

‘సీమ టపాకాయ్’ యూట్యూబ్ చానల్‌ను ఒంటిచేత్తో నడిపించేది ఈ భార్గవ్. ఏదో వ్యూస్ కోసం కాకుండా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, వాయిస్ ఓవర్‌..ఇలా అన్ని చూసుకుంటూ ప్రాణం పెట్టి వీడియోలు చేస్తాడు. తెలుగు సినిమాల్లో దర్శకుడు త్రివిక్రమ్‌ను మాటల మాంత్రికుడు అన్నట్లుగా భార్గవ్‌ను తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో మాటల మాంత్రికుడు అనొచ్చు. ప్రతి మాటా తూటాలాగా పేలి గుండెలో గుచ్చుకుంటుంది. ఈ మాటను మీరు నమ్మకపోతే ఇటీవల ఆ చానల్‌లో విడుదలైన ‘ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్‌ ఫేర్‌వెల్’ సిరీస్ చూడండి. ఉన్నది మూడు ఎపిసోడ్‌లే అయినా, ప్రతి డైలాగ్‌తో లోపల ఉన్న భగ్న ప్రేమికుడికి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఎప్పుడూ అమ్మాయి మోసం చేసిందని ఆరోపణలు చేసే అబ్బాయిలను ఆలోచనలో పడేస్తుంది. ప్రతి ఒక్కరికి బ్రేకప్ లవ్‌స్టోరీ ఉంటుంది. అది అందరితో పంచుకోలేకపోవచ్చు. బ్రేకప్ అవడానికి కారణాలు ఏవైనా కావొచ్చు. ఆ అమ్మాయిని మాత్రం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక్కసారి ఈ సిరీస్ చూస్తే వెంటనే మాజీ ప్రియురాలికి కాల్ చేస్తే ఫేర్‌వెల్ పార్టీ ఇవ్వాలనిపిస్తుంది.

‘సీమ టపాకాయ్’ యూట్యూబ్ చానల్‌లో 30 వరకు వీడియోలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్క వీడియోలో కనీసం నాలుగు నుంచి ఐదు మాటల తూటాలు ఉంటాయి. ఇక ఇందులో ఉన్న ‘ఫీమేల్ ఫ్లాట్‌మేట్’ సిరీస్ గురించి చెప్పుకోవాలంటే ప్రత్యేకంగా ఇంకో ఆర్టికల్ రాసుకోవాలి. లక్షా యాభై వేల సబ్‌స్క్రైబర్‌లు ఉన్న ఈ చానల్‌లో కంటెంట్ మాత్రం ఒక మిలియన్ సబ్‌స్క్రైబర్ల మనసులను దోచుకునేలా ఉంటుంది. మొత్తం ఎమోషనల్ వీడియోలే ఉంటాయని అనుకోవద్దు, మనసును కడుపుబ్బా నవ్వించే కంటెంట్ కూడా ఈ చానల్‌లో ఉంది. మరి ఆ యూట్యూబ్ త్రివిక్రమ్‌ పెట్టిన కంటెంట్‌తో ఎమోషనల్ రైడ్‌ చేసేయండి ఇక.

Advertisement

Next Story