- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లరి కృష్ణయ్య అద్భుత క్షేత్రాలు..
దిశ, ఫీచర్స్ : దేవకీ వసుదేవుల నందనుడు, యశోదమ్మ గారాల తనయుడైన శ్రీకృష్ణుడి లీలలు ఏమని చెప్పగలం. ఎంతని వర్ణించగలం. రేపల్లె గోధూళిలో, ద్వారక వాయువుల్లో, మధుర క్షేత్రంలో, పూరి తీరంలో ఎక్కడ చూసినా అక్కడ తానై కనిపించే గోవిందుడి దేవాలయాలు దేశమంతటా నిత్యశోభాయమానంగా విలసిల్లుతున్నాయి. మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్‌లో శ్రీనాథ్‌జీగా, ఉడిపిలో కృష్ణునిగా, గురువాయూరులో గురువాయురప్పగా పూజలందుకుంటున్న ఆ పరమాత్ముడి ‘జన్మాష్టమి’ సందర్భంగా ఆయా ఆలయాలు హరే కృష్ణ నామస్మరణతో మారుమోగుతాయి. ఈ సందర్భంగా భారతదేశంలో శ్రీకృష్ణుని ప్రముఖ పుణ్యక్షేత్రాల విశేషాలు.
బృందావనం (యూపీ)..
మధురను శ్రీ కృష్ణ జన్మభూమిగా పిలుస్తారు. ఇది శ్రీకృష్ణుడికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పుణ్యధామాల్లో ఒకటి. 50 అడుగుల ఎత్తయిన ద్వాదశాదిత్య శిలపైన ఉన్న శ్రీ రాధా మదన్ మోహన్ మందిరం.. బృందావనంలో నిర్మించిన మొదటి ఆలయంగా చెబుతారు. ఆలయ ప్రధాన విగ్రహాన్ని మదన మోహన్ బృందావనంలోని పురాతన వటవృక్షం దిగువన కనుగొన్నట్లు స్థానికులు చెబుతారు. ఇక ఇక్కడి కేశవ దేవాలయం లేదా కృష్ణ జన్మ్‌స్థల్ ఆలయ ప్రారంభ నిర్మాణాన్ని రాజా వీర్ సింహ్ బుండేలా నిర్మించాడని చెబుతారు. ఎన్నోమార్లు ఆలయం ధ్వంసం కాగా అనేకసార్లు పునర్నిర్మించారు. ఆలయ ప్రధాన గర్భగుడిలో కృష్ణుడు, రాధ, బలరాముని చిన్న విగ్రహాలతో పాటు పాలరాతి కృష్ణుడి విగ్రహం కొలువై ఉంది. ప్రధాన గర్భగుడి వెనుక భాగంలో ఒక చిన్న గది ఉండగా, ఇది శ్రీకృష్ణుడు జన్మించిన జైలని స్థానికులు అంటారు. జన్మాష్టమి, చప్పన్ భోగ్, లతామర్ హోలీ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు.
అడుగడుగునా శ్రీకృష్ణ ఆలయాలున్న మధురలో గర్భ గుహ, భాగవత భవన్‌తోపాటు కృష్ణుడు బాల్యంలో నడయాడిన గోకులం, బృందావనం, ఇస్కాన్ వంటి ప్రదేశాలు ప్రాముఖ్యత పొందాయి. మధుర నుంచి బృందావనం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గోవిందదేవ్, మీరాబాయి దేవాలయాలు ప్రసిద్ధి పొందినవి. బృందావనానికి సమీపంలోనే గోవర్ధన పర్వతం ఉంది. గోవర్ధన నుండి ఐదు కిలోమీటర్ల దూరంలోనే రాధా కుండ్/ శ్యామ్ కుండ్ ఉంటుంది. తన అడుగు ముద్రతో గోవిందుడు అనేక నదుల నీటితో ఈ కుండ్‌ను నింపాడని స్థలపురాణం. ఇక గోపికలు శ్రీకృష్ణునికి రాకకోసం వేచి చూసే కుసుం సరోవర్ కూడా చూడదగిన ప్రదేశం. ఇక్కడి ప్రేమ్ మందిర్ భారతదేశంలో అద్భుతమైన హిందూ దేవాలయాల్లో ఒకటిగా చెప్పొచ్చు. బృందావనం శివార్లలో ఉన్న ఈ దివ్య దేవాలయంలోని ప్రతి మూలలో శ్రీకృష్ణుని జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను చిత్రీకరించే అద్దాల చిత్రాలు, బొమ్మలను చూడవచ్చు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి జన్మాష్టమి, రాధాష్టమి ఉత్తమ సమయం.
ద్వారక (గుజరాత్)
గోమతీ నదీ తీరంలోని మహిమాన్విత పుణ్యక్షేత్రం ద్వారక. కృష్ణుడు ఏలిన ప్రాంతంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దాదాపు 2500 సంవత్సరాల కిందట నిర్మించిన ద్వారకాధీశుడి దేవాలయం ప్రధానమైంది. జగత్ మందిర్ లేదా త్రిలోక్ సుందర్ అని కూడా పిలుస్తారు. హిందూ మతవిశ్వాసాల ప్రకారం భారతదేశంలోని నాలుగు ధామ్‌లలో ఒకటిగా దీన్ని పరిగణిస్తున్నారు. ఆలయ ప్రధాన విగ్రహం నల్ల పాలరాతితో చెక్కగా, కౌస్తుభ మణి, లక్ష్మీదేవి బహుమతిగా ఇచ్చిన దండతో దీన్ని అలంకరించారు. గొప్ప చాళుక్య శైలి నిర్మాణానికి నిదర్శనంగా ఈ గుడి నిలుస్తుంది. దివ్య ప్రబంధాలలో సూచించిన విష్ణుభగవానుని 108 దివ్యప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి. ఏటా జన్మాష్టమికి ఇక్కడ నిర్వహించే వేడుకలను చూసేందుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. శ్యామల్‌జీ, గోమతీ ఘాట్, ద్వారక లైట్‌హౌస్, గీతామందిరం, జాంబవతీదేవి, సత్యభామాదేవి, రుక్మిణీదేవి, జగన్నాథ్ ఆలయాలు చూడదగిన ప్రదేశాలు కాగా ద్వారక క్షేత్రానికి సమీపంలోని గోమతీ నది సముద్రంలో సంగమిస్తుంది. అక్కడికి చేరువలో ఉన్న బేట్ ద్వారకను శ్రీ కృష్ణుని నివాసస్థలంగా చెబుతారు. దీనికి ఐదు కి.మీ. దూరంలో శంఖతీర్థం ఉంది.
గురువాయూర్
కేరళలోని గురువాయూర్‌లోని శ్రీకృష్ణ దేవాలయాన్ని భూలోక వైకుంఠంగా అభివర్ణిస్తారు. అంతేకాదు గురువాయూర్‌ను ‘దక్షిణ భారత ద్వారక’గా పేర్కొంటారు. ఈ కోవెలలోని స్వామి విగ్రహాన్ని విష్ణుమూర్తే స్వయంగా సృష్టించారని అంటారు. ఇక్కడి స్వామిని గురువాయూరప్పగా కొలుస్తారు. స్వామి విష్ణువు రూపంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం కృష్ణ ఆలయంగానే ప్రసిద్ధి పొందింది. దేవాలయంలోని ప్రధాన గర్భగుడిని క్రీ.శ.1638 లో నిర్మించగా, ఇక్కడ స్వామి నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయానికి ఉత్తరాన గల రుద్రతీర్థం వేల ఏళ్ల నాటి నుంచి ఉందని చెబుతారు. సాక్షాత్తు పరమశివుడు ఇక్కడ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడని ప్రతీతి. శ్రీకృష్ణ జన్మాష్టమి, డోలాపూర్ణిమ, విషు, కుచేల దినోత్సవ సమయాల్లో ఇక్కడ వైభవోపేతంగా జరుగుతాయి. ఇక్కడి విగ్రహాన్ని గురు, వాయులే కలిసి తీసుకొచ్చారని స్థలపురాణం చెబుతుండగా, అందుకే ఈ ప్రాంతానికి ‘గురువాయుర్’ అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయంలో వివాహాలు అత్యధిక సంఖ్యలో జరుగుతాయి. ఇక్కడ అన్నప్రాసన చేస్తే చిన్నారులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని భక్తుల నమ్మకం. ఇక్కడ ఏనుగుల పందెం కూడా నిర్వహిస్తారు. ఆలయంలోకి ప్రవేశించడానికి, భక్తులు డ్రెస్ కోడ్ పాటించాలి.
గురువాయూర్‌లోని మమ్మియూర్ మహాదేవ క్షేత్రం, వెంకటాచలపతి, పార్థసారథి, చాముండేశ్వరి దేవాలయాలు సందర్శించవచ్చు.
ఉడిపి (కర్ణాటక)
పశ్చిమ కనుమల తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న ఉడిపి దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణుడికి పవిత్రమైన హిందూ దేవాలయం. వేదాంత ద్వైత పాఠశాల స్థాపకుడైన వైష్ణవ సాధువు మధ్వాచార్యాలు 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని ప్రారంభించారు. మధ్వాచార్యుడు కృష్ణుడి విగ్రహాన్ని ఓడలో కనుగొన్నాడని స్థానికులు చెబుతారు. అయితే ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్న కిటికీ నుంచే స్వామిని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. తన భక్తుడైన కనకదాసుడికి స్వామి ఈ కిటికీ నుంచే దర్శనం ప్రసాదించారని ప్రతీతి కాగా దీన్ని ఆయన పేరు మీదుగా ‘కనకన ఖండి’గా పిలుస్తారు. ముందు భాగంలోనూ ఓ విండో ఉండగా దీన్ని నవగ్రహ రకం అని పిలుస్తారు. ఇక మఠాధిపతులే మాత్రమే గర్భాలయంలో పూజలు నిర్వహిస్తుండగా, వీరికితప్ప మరెవరికీ అందులోకి ప్రవేశం లేదు. జన్మాష్టమి వేడుకలకు ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లో ఉడుపి ఒకటి కాగా జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వేడుకని చూడాలని భక్తులు కోరుకుంటారు. చిన్ని క్రిష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా ‘విట్టల్ పిండి’ పేరుతో కృష్ణుని మట్టివిగ్రహాన్ని రూపొందించి ఊరేగిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని సరోవరంలో నిమజ్జనం చేయడం విశేషం.
కోల్లూరుముకాంబికా దేవాలయం, మల్పే రేవు, కాపుదీపస్తంభం, కుండేశ్వర దేవాలయం, బెల్‌కల్ తీర్థ ఫాల్స్, మట్టు బీచ్, గోమటేశ్వర, చంద్రేశ్వర, అనంతేశ్వర దేవాలయాలు చూడదగ్గవి కాగా.. జైపూర్-గోవింద్ దేవ్‌జీ టెంపుల్, బెంగళూరు- ఇస్కాన్, రాజస్థాన్- శ్రీనాథ్‌జీ టెంపుల్, కేరళ- అంబలప్పుజ శ్రీకృష్ణ టెంపుల్, ఆంధ్రప్రదేశ్-నెమలి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం, కర్ణాటక- హంపి బాలక్రిష్ణ ఆలయంతో పాటు అనేక కృష్ణ మందిరాలు సర్వాంతర్యామి నెలకొన్న దివ్యధామాలుగా విలసిల్లుతున్నాయి.