ఫ్లాష్.. ఫ్లాష్.. ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత.. ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం

by Anukaran |
ఫ్లాష్.. ఫ్లాష్.. ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత.. ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సీఎం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఓ పేద కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కబ్జాకు గురైన ఐదు ఎకరాల భూమి విషయంలో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, పరిష్కరించడంలో అలసత్వం వహించిందని వారు ఆరోపించారు. మరో మార్గం లేక ప్రాణాలు తీసుకోవడమే ఉత్తమమని భావించామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన భార్య, భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి ప్రగతి భవన్‌ వద్దకు వచ్చి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని ఆ ప్రయత్నం నుంచి నివారించారు.

కబ్జాకు గురైన ఐదు ఎకరాల భూమి విషయాన్ని రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి వివరించినా పట్టించుకోలేదని, ప్రతీ రోజు మానసిక క్షోభకు గురవుతున్నామని కుటుంబ పెద్ద వాపోయారు. కనీసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తే పరిష్కారం దొరుకుతుందనుకున్నామని పేర్కొన్నారు. ఆత్మహత్య తప్ప మరోమార్గం లేకనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులకు తెలిపారు. వారి భూమికి సంబంధించిన వివరాలను సేకరించిన పోలీసులు సంబంధిత అధికారులకు పంపిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed