- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరవరరావును బతికించండి
దిశ, న్యూస్‌బ్యూరో: మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న పౌరహక్కుల కార్యకర్త వరవరరావు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, తక్షణం ఆయనకు వైద్య చికిత్స అందించాల్సి ఉన్నదని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని ఆయనను బతికించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌కు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలకు లేఖలు రాశామని, కానీ వారి నుంచి సమాధానం రాలేదని వరవరరావు భార్య హేమలత గుర్తుచేశారు. మీడియాతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా వరవరరావు భార్య, కుమార్తెలు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
వరవరరావు ఆరోగ్యం బాగాలేదని తామంతా భాధపడుతున్నామని, ఎన్నిసార్లు కోర్టుల్ని సంప్రదించినా, అధికారులకు మొరపెట్టుకున్నా, ప్రజాప్రతినిధులను కలిసినా పట్టించుకోవడం లేదని భార్య హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 24వ తేదీ నుంచి ఆయన మాట్లాడడం బందయిందని, ప్రతీ వారం తమతో మాట్లాడించాల్సిన జైలు అధికారులు కూడా ఆ నిబంధనను పాటించడంలేదన్నారు. జైల్లోని కొద్దిమంది ద్వారా వచ్చిన సమాచారంతో శనివారం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశామని, కానీ మాట ముద్దగా రావడం మాత్రమే కాకుండా పొంతన లేకుండా మాట్లాడారని, ఎప్పుడో చనిపోయిన తన తల్లిదండ్రుల గురించి మళ్ళీ చనిపోయారనే భ్రాంతితో మాట్లాడారని అన్నారు.
గతంలో ఆయన ఆరోగ్యం బాగలేకపోవడంతో మే 26న జేజే ఆసుపత్రికికి తరలించినట్లు పోలీసులు సమాచారం ఇచ్చారని, తాము వెళ్లడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని హేమలత గుర్తుచేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చికిత్స చేయించాలని కోరుతూ, తెలంగాణ, మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఎన్ని పిటిషన్లు వేసినా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 నుంచి వరవరరావు కొట్లాడారని, పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నారని, సీఎం కేసీఆర్‌కి ఎన్ని లేఖలు రాసినా కనీసం రిప్లై కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “దయచేసి నా భర్తకు కనీస చికిత్స అందించండి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని గతంలో అప్రోచ్ అయ్యాం. శనివారం కూడా కూడా ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందనా లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
సరైన చికిత్స అందించకపోతే ఆయన బ్రెయిన్ మరింత దెబ్బతినే అవకాశం ఉందని, గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం క్షిణిస్తూ ఉందని కుమార్తె సహజ పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ ఉద్దేశపూర్వకంగానే వరవరరావుపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డికి వరవరరావు గురించి అంతా తెలుసన్నారు. ఇప్పటివరకూ స్పందించలేదు కాబట్టి ఇకనైనా కలుగజేసుకొని కనీస చికిత్స అందేలా చూడాలని ప్రాధేయపడ్డారు.
చట్టపరిధిలో తన వంతు ప్రయత్నం చేస్తా : కిషన్‌రెడ్డి
చట్ట పరిధిలో వరవరరావుకు అవసరమైన సహాయ సహకారాలను అందజేస్తానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జైల్లో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదన్న సంగతి తనకు తెలుసునని, వెంటనే చట్ట పరిధిలో ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకు ఆయన విషయంలో తగిన తీరులో స్పందిస్తానని మీడియా సమావేశం సందర్భంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
వెంటనే ఆసుపత్రికి తరలించాలి
పత్రికల్లో వస్తున్న వార్తలు, కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు తెలిసిన విషయాలను గమనిస్తే వరవరరావు ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్లు అర్థమవుతోందని, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి తగిన వైద్య చికిత్స అందించాలని ఐదుగురు రచయితలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరవరరావుపై పెట్టిన అభియోగాలపై విచారణ జరుపుతున్న నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వెంటనే ఆయనను జేజే ఆసుపత్రికి తరలించాలని, గత 22నెలలుగా విచారణకు ఆయన పూర్తి సహకరిస్తున్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని రొమిలా థాపర్, ప్రభాత్ పట్నాయక్, దేవకి జైన్, మాజా దారువాలా, సతీష్ దేశ్‌పాండే ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం జరిగి రిస్కు చోటుచేసుకున్నా అది ‘ఎన్‌కౌంటర్’ లాంటిదానికి సమమవుతుందని పేర్కొన్నారు. దేశం రూపొందించుకున్న చట్టాన్ని గౌరవించాలని సూచించారు.