- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంగుల లోకంలో మహిళల పాత్ర ఎందరికో ఆదర్శం..
దిశ, ఫీచర్స్: రంగుల లోకంలో ‘స్త్రీ’ పాత్రలకే కాదు, మహిళామణుల ప్రతిభకు కూడా అంత త్వరగా గుర్తింపు రాదు. డైరెక్షన్, స్టంట్స్, సినిమాటోగ్రఫీ, మేకప్, మ్యూజిక్.. ఇలా సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్‌లో అంతా పురుషాధిపత్యమే. అయితే ఆ స్టీరియోటైప్స్‌ను బ్రేక్ చేసి.. వెండితెర సాక్షిగా వెలుగొందుతున్న నారీమణులూ ఉన్నారు. అడ్డంకులను అధిగమించడం అంత సులభం కాకపోవచ్చు కానీ అసమానతలతో పోరాడటం ఖచ్చితంగా విజయానికి దారితీస్తుందని ఈ మహిళలు నిరూపించారు! తాము ఎన్నుకున్న దారిలో మరెంతోమంది మహిళలు రాణించడానికి దోహదపడ్డారు. ఈ నేపథ్యంలో సమాజంలో నిజమైన మార్పు తీసుకురావడానికి తెరవెనుక పనిచేస్తున్న మహిళల స్ఫూర్తితో నేటి ‘మహిళా దినోత్సవాన్ని’ సగర్వంగా జరుపుకుందాం.
అరుణా రాజే (రైటర్, ఫిల్మ్ మేకర్)
‘ఫిల్మ్ క్రూ మొత్తం నన్ను ‘జూ’లో యానిమల్‌ను చూసినట్లుగా చూసేవారు’ అని ఓ సందర్భంలో అరుణ చెప్పిన మాటల్లోనే బిహైండ్ ద కెమెరా ‘స్ర్తీ’ పాత్ర ఏపాటిదో అర్థమైపోతుంది. ఆమె కెరీర్ విషయానికొస్తే.. దర్శక, రచయిత, నిర్మాతగా రాణిస్తున్న అరుణ.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని మొదటి మహిళా సాంకేతిక నిపుణుల్లో ఒకరు. ఎఫ్‌టీఐఐ(Film and Television Institute of India)లో గోల్డ్ మెడల్ సాధించిన అరుణ, చిత్రనిర్మాతగా చాలా సవాళ్లను ఎదుర్కొంది. ‘మహిళలు పురుషుల్ని శాసించడాన్ని ఇష్టపడరు. అది మన సమాజంలో చాలా సాధారణమైన విషయం. అయితే ఈ రంగంలో నేను సక్సెస్ సాధించడానికి పురుషుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా కష్టపడ్డాను. ఈ క్రమంలోనే సెట్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్లుగా మహిళలను నియమించుకోవడంతో మెల్లగా ఇండస్ట్రీలోనూ మార్పు మొదలైంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటానికి యూనిట్‌లో కనీసం ఒక ఆడపిల్లయినా ఉండాలని ఓ దర్శకుడు చెప్పడంతో ఆ తర్వాత నెమ్మదిగా ‘మహిళ’ క్రూ పట్ల అంగీకారం ప్రారంభమైంది. నాతో పాటు రేణు సలుజా ఎడిటింగ్ చేస్తుండగా, సాయి పరంజ్‌ప్యే ఫిల్మ్ మేకింగ్, అపర్ణ సేన్ సినిమాలు చేయడం ప్రారంభించారు. అయితే వర్క్‌ఫోర్స్‌లో కేవలం 10 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. కేవలం మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇలానే ఉంది’ అని అరుణ తెలిపారు.
రేష్మా పఠాన్ (స్టంట్ ఉమన్)
ఫైట్స్ కంపోజింగ్ అనగానే పురుషులు గుర్తుకురావడం సాధారణం. బాలీవుడ్‌లో తొలి స్టంట్ ఉమెన్‌గా రేష్మా పఠాన్ తన మార్క్ స్టంట్స్‌తో కొత్త సంప్రదాయానికి నాంది పలికింది. ఇండస్ట్రీలో ఉన్న స్టంట్‌మెన్ ఆమెను నిరుత్సాహపరిచేందుకు ఎంతగానో ప్రయత్నించినా, ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. సెట్స్‌లో రిస్కీ షాట్స్ చేసే రేష్మ, తన గురించి కుటుంబానికి తెలియకుండా జాగ్రత్త పడింది. ‘ఫైట్ మాస్టర్ అజీమ్ మామయ్య నన్ను ‘ఏక్ ఖిలాడి బవన్ పట్టే ’ సెట్స్‌లో పిలిచారు. అక్కడ ఒక వ్యక్తి ఓ స్టంట్ కోసం హీరోయిన్ డూబ్‌గా చేస్తున్నాడు. చాలా టేక్స్ తీసుకున్నా చేయలేకపోయాడు. దాంతో వాళ్లు నన్ను ప్రయత్నించమని అడిగినప్పుడు, మొదటి టేక్‌లోనే పర్ఫెక్ట్ షాట్ చేయడంతో టేక్ ఓకే అయింది. అయితే, నేను సినిమా రంగంలోకి ప్రవేశించడం పట్ల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నా. దశాబ్దాల క్రితం నుంచి హీరోయిన్స్ వేషధారణలో స్టంట్‌మెన్ మాత్రమే స్టంట్స్ చేసేవాళ్లు, అందుకోసం రెట్టింపు జీతం తీసుకునేవాళ్లు. నేను రావడంతో.. స్టంట్‌మెన్ నన్ను నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. స్టంట్స్ చేసేటప్పుడు గాయపడితే, నిన్ను ఎవరూ వివాహం చేసుకోరని చెప్పేవాళ్లు. వాళ్లు చెప్పే విషయాలను పట్టించుకోకుండా, నేను మొండిగా ముందుకు వెళ్లడం చూసి ఆ తర్వాత వాళ్లే అర్థం చేసుకున్నారు. మొదట దర్శకులు కూడా నన్ను విశ్వసించలేదు కానీ.. నేను చేస్తున్న పని, దాని ఫలితమే వారికి సమాధానం చెప్పింది. రిస్కీ స్టంట్స్ ఇప్పటికీ నటులు చేయడం లేదు. ఎందుకంటే ఒక్క గాయమైనా అది వారి భవిష్యత్ ప్రాజెక్టులను ఆలస్యం చేస్తుంది. కాబట్టి, ఇప్పుడు, చాలా మంది మహిళా స్టంట్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో ఉన్నారు’ అని రేష్మ పేర్కొంది.
ప్రియా సేథ్ (సినిమాటోగ్రాఫర్)
‘పితృస్వామ్యం, ఫిమేల్ డామినెన్స్ అనేవి ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితమైంది కాదు’ అని మాట్లాడే ప్రియాసేథ్.. బీటౌన్‌లో సూపర్బ్ సినిమాటోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకుంది. 1998లో అమీర్ ఖాన్ చిత్రం ‘ఎర్త్’తో కెమెరా అసిస్టెంట్‌గా తన వృత్తిని ప్రారంభించిన ప్రియ, ప్రస్తుతం అండర్ వాటర్ సీక్వెన్స్ తీయడంలో ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరిగా నిలిచింది. ‘ఎయిర్‌లిఫ్ట్’, ‘చెఫ్’, ‘మర్దానీ 2’, పాపులర్ వెబ్ షో ‘తాండవ్’ వంటి చిత్రాలకు పనిచేసింది. ‘ఇది మేల్స్ మాత్రమే చేయగలరా? మహిళలు చేయలేరా? అనే విషయాలేవీ నాకు తెలియదు. నేను ఫిల్మ్ మేకింగ్‌లోకి రావాలని కోరుకున్నాను, వచ్చాను. కానీ మహిళా సినిమాటోగ్రాఫర్లకు సమాన అవకాశాన్ని కనుగొనడమే గొప్ప సవాల్. దేశం మొత్తం మీదున్న సినిమాటోగ్రాఫర్లలో.. ఒక శాతం కంటే తక్కువ మంది మహిళలు ఈ వృత్తిలో ఉన్నారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే మెయిన్ స్ట్రీమ్ మూవీస్‌కు పనిచేస్తున్నారు. నా కెరీర్ ప్రారంభ రోజుల్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అంతేకాదు నేను ఈ కెరీర్‌ను నిర్వహించగలనా లేదా? అనే ప్రశ్నలు తలెత్తాయి? పురుషులను ఎప్పుడూ ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగరు? జెండర్‌ను పక్కనపెట్టి ‘ప్రతిభ’ను మాత్రం పరిగణనలోకి తీసుకోవాలి. నేను నా కోసం మాత్రమే మాట్లాడటం లేదు. నేను ఇటీవల విదేశాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఇదే విధమైన అనుభవం ఎదురైంది. ఆడపిల్ల నుంచి సూచనలు తీసుకోవడానికి వారు సిద్ధంగా లేరు. కాబట్టి పితృస్వామ్యం, షోవనిజం(chauvinism) భారతదేశానికే పరిమితం కాలేదు’ అంటోంది ప్రియ.
చారు ఖుర్రానా (మేకప్ ఆర్టిస్ట్)
ఇదివరకు సినిమా రంగంలో మేకప్ ఆర్టిస్ట్‌లను గమనిస్తే.. పురుషులు మాత్రమే కనిపించేవారు. ఎందుకంటే మేకప్ అసోసియేషన్ రూల్స్ ప్రకారం మేల్స్‌కు మాత్రమే ఆ చాన్స్ ఉండేది. కానీ ఈ విషయంపై సుప్రీంకోర్టులో పోరాడి గెలిచిన ‘చారు ఖుర్రానా’ ఎంతోమంది మహిళలు మేకప్ ఆర్టిస్టులుగా రాణించేందుకు ఓ పాత్ క్రియేట్ చేసింది. ‘2000లో ఓ మూవీ ప్రాజెక్ట్ కోసం ముంబై వెళ్లాను, అయితే ఆ క్రమంలో నాపై దాడి జరిగింది, వారు నా మెంబర్‌షిప్ కార్డు అడిగారు. అది లేకపోవడంతో ఫైన్ చెల్లించి పని చేశాను. కానీ మెంబర్‌షిప్ కార్డ్ లేకపోతే, ప్రాజెక్ట్స్ రావని నాకు అర్థమైంది. దాంతో అసోసియేషన్‌కు వెళ్లగా, మేకప్ చేయడానికి పురుషులను మాత్రమే అనుమతిస్తామని, మహిళలు సెట్స్‌లో హెయిర్ డ్రెస్సర్‌గా ఉండొచ్చని తెలిపింది. ఈ సమస్యల కారణంగా, నేను తిరిగి ఢిల్లీకి వెళ్లాను. 8-9 సంవత్సరాల తర్వాత, కమల్ హసన్ ‘ఈనాడు’ చిత్రానికి పనిచేసే అవకాశం వచ్చింది. ప్రారంభంలో నేను ఏ సమస్యను ఎదుర్కోలేదు, కానీ నేను యూనియన్ సభ్యురాలిని కానందున మళ్ళీ జరిమానా చెల్లించాను. అయితే ఈసారి మాత్రం ఈ విషయంపై చట్టబద్ధంగా పోరాడాలనుకున్నాను. నేను కాకపోతే ఇంకెవరు పోరాడతారని, వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకున్నాను. దాంతో మహిళల కోసం జాతీయ కమిషన్‌కు వెళ్ళాను, అక్కడి నుంచి సుప్రీంలో కేసు గెలిచాను. ప్రస్తుతం 500 మందికిపైగా మహిళలు మేకప్ విభాగంలో పనిచేస్తున్నారు. ఇది ఎంతో సంతోషాన్నిచ్చే విషయం’ అని చారు గర్వంగా చెబుతోంది.
చంపా తివారీ (సౌండ్ రికార్డిస్ట్)
భర్త బీఎన్ తివారీని చూసి సౌండ్ ఇంజనీరింగ్ నేర్చుకున్న చంపా తివారీ.. ఈ రంగంలో ఎంతోమందికి రోల్‌మోడల్‌గా నిలిచింది. ‘నేను నా భర్తతో రికార్డింగ్ స్టూడియోకి వెళ్లేదాన్ని, అతని పనిని గమనించేదాన్ని. అయితే స్టూడియోకి వచ్చే ఎంతోమంది నటీనటులు, నన్ను అక్కడ చూసి సంతోషించేవాళ్లు. సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో మహిళలు ఉంటే బాగుంటుందని చెప్పేవాళ్లు. 1987లో హీరో రాజేష్ ఖన్నా మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? వెళ్లి సౌండ్ డిపార్ట్‌మెంట్ సభ్యురాలిగా నమోదు చేసుకోండి అని చెప్పారు. అసోసియేషన్‌లో సభ్యత్వం పొందిన మొట్టమొదటి మహిళా సౌండ్ ఇంజనీర్ నేనే కాగా, ఆ తర్వాత నా కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే నాకన్నా ముందు ప్రి ఇండిపెండెన్స్ ఎరాలో దక్షిణాది నుంచి మీనా నారాయణన్ తొలి భారతీయ సౌండ్ ఇంజనీర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మా విభాగంలో చాలా కొద్ది మంది మహిళలు మాత్రమే ఉన్నారు. సౌండ్ రికార్డిస్ట్‌గా మహిళల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణం పురుషులు తమ జెండర్‌కే ప్రయారిటీ ఇవ్వడంతో పాటు తమ గ్రూపులో ఓ మహిళ ఉంటే తమకు అడ్డంకిగా భావించడమే’ అంటూ తన అనుభవాలను పంచుకుంది చంపా తివారీ.
మన తెలుగు ఇండస్ట్రీలోనూ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే మహిళలు పలు విభాగాల్లో రాణించారు. విజయనిర్మల, భానుమతి, సావిత్రి, జమునలు హీరోయిన్స్‌గా ఖ్యాతి తెచ్చుకోవడంతో పాటు దర్శక నిర్మాతలుగానూ సక్సెస్ అయ్యారు. ప్రస్తుత కాలంలో ‘నందినీ రెడ్డి, సుధా కొంగర’ డైరెక్టర్స్‌గా రాణిస్తుండగా, కొరియోగ్రాఫర్‌గా యానీ మాస్టర్, రైటర్‌గా చైతన్య పింగళి, ప్రొడక్షన్ డిజైనర్‌గా మోనికా రామకృష్ణ ఇండస్ట్రీ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక బాలీవుడ్ విషయానికొస్తే ఇప్పటికే ‘మీరా నాయర్, దీపా మెహతా, మేఘనా గుల్జర్, జోయా అఖ్తర్, గౌరీ షిండే, రీమా ఖగ్తి, కిరణ్ రావు, ఫరా ఖాన్, కొంకణా సేన్, అపర్ణా సేన్, అలంకృత శ్రీవాత్సవ, అనూష రిజ్వి, అశ్వనీ అయ్యర్ తివారీ, తనూజ చంద్ర’ డైరెక్టెర్స్‌గా రాణిస్తున్నారు.
పురుషాధిక్య ప్రపంచంలో.. ఉమెన్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అంతెత్తుకు ఎదుగుతారు. ప్రధానంగా సినీరంగంలో.. లైట్‌మెన్, స్పాట్ బాయ్స్ కూడా మహిళలు ఆర్డర్స్ చేస్తే పట్టించుకోరు. ఇప్పటికీ అలాంటి ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నా, మహిళలు రాణిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వివక్ష కూడా పోయి.. సగర్వమైన మహిళా విజయం దక్కాలని ఆశిస్తూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జయహో మహిళ.. దిశ.. సెల్యూట్ టు ఆల్ ఉమెన్!