సాగు చట్టాలతో చిన్న రైతులకు లబ్ది: మోడీ

by Shamantha N |
సాగు చట్టాలతో చిన్న రైతులకు లబ్ది: మోడీ
X

న్యూఢిల్లీ: సాగు చట్టాలతో చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి సాగు సంస్కరణలను సమర్థించారు. విదేశీ సంస్థలను వ్యవసాయ రంగంలోకి తీసుకురావాలని చట్టాలు తేవడానికి ప్రయత్నించినవారే ఇప్పుడు రైతుల్లో భయాందోళనలను నూరిపోస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు దేశ నాయకులకు తగిన ప్రాధాన్యతనివ్వలేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో వారియర్ కింగ్ సుహెల్దేవ్ విగ్రహానికి వీడియో కాన్ఫరెన్స్‌లో శంకుస్థాపన వేశారు. అనంతరం అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కొత్త సాగు చట్టాలతో చిన్న రైతులు లబ్ది పొందుతారని, చట్టాలపై దుష్ప్రచారం చేస్తున్నవారిని ఇప్పుడు రైతులే పసిగట్టి బయటపెడుతున్నారని అన్నారు.

కొత్త సాగు చట్టాలతో రైతులు తమ పంటను ప్రభుత్వ ఏజెన్సీలతోపాటు ప్రైవేటు కంపెనీలకూ అమ్ముకునే స్వేచ్ఛను కల్పిస్తున్నాయని మోడీ వివరించారు. వీటి అమలు తర్వాత యూపీ రైతులు ప్రోత్సాహకర ఫలితాలు పొందుతున్నారని చెప్పారు. అనంతరం రాజు సుహెల్దేవ్ గురించి చెప్పుకొచ్చారు. దేశాన్ని అదుపులో పెట్టుకున్న వలసవాదుల కోణంలో రాసిన చరిత్రనే భారత చరిత్ర కాదని వివరించారు. అందుకే సుహెల్దేవ్ పోరాటాలు, వీరగాథలు లోకోక్తులు, జానపత కథల రూపంలో ప్రజల నాలుకల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళనలు మూడో నెలలోకి ప్రవేశించిన తరుణంలో ప్రధానమంత్రి సాగు సంస్కరణలను మరోమారు సమర్థించారు.

Advertisement

Next Story