వీటి రేటు కరోనా కన్నా ఘోరం…!

by Shyam |   ( Updated:2020-08-21 23:25:10.0  )
వీటి రేటు కరోనా కన్నా ఘోరం…!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటీవల వరకు కిలో రూ. 50 లోపు ఉన్న టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్ , వంకాయ , బీరకాయ, బీన్స్ , దొండ, చిక్కుడు, గోకరకాయ ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పచ్చిమిర్చి ధర ఏకంగా సెంచరీ దాటేసింది.

రూ 400 కిలో చింతకాయ..

వినాయక చవితి సందర్భంగా ప్రజలు అధికంగా చింతకాయ కొనుగోలు చేస్తారు. దీంతో ఇప్పటి వరకు అంతగా డిమాండ్ లేని చింతకాయ ధర కిలో రూ. 400కు చేరింది. చింతకాయ కొనడం మాట అటుంచి ధర వింటేనే భయపడేలా ఉందని పలువురు వాపోతున్నారు. కరోనా ప్రభావం చూపక ముందు రైతు బజార్లలో ధరలు నిలకడగా ఉండేవి. అయితే కరోనా పెరిగిపోతుండడంతో ప్రభుత్వం రైతు బజార్లను మూసి వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బహిరంగ మార్కెట్లో కూరగాయల వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్మకాలు జరుపుతున్నారు.

పూల ధరలకు రెక్కలు…

పండగ సందర్భంగా అన్ని రకాల పూల విక్రయాలు అధికంగా ఉంటాయి. ఇలా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పూల ధరలను కూడా అమాంతం పెంచేశారు. కిలో రూ.50 కూడా ఉండని బంతి పూల ధరలు రూ. 100 దాటేశాయి. చామంతి, గులాబి వంటి ఇతర పూల ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలో చామంతి నాణ్యతను బట్టి కిలో రూ 300 వరకు విక్రయిస్తున్నారు. ఇలా పండుగల సందర్భంగా వ్యాపారులు ధరలు పెంచి అమ్మకాలు జరుపుతున్నారు.

Advertisement

Next Story