వైఎస్ఆర్ జలకళ కాంట్రాక్టర్ల ఆత్మహత్య లేఖ.. మాపై దయ ఉంచండి

by Mahesh |   ( Updated:2021-12-14 04:31:02.0  )
ysr jalakala
X

దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ జలకళ కాంట్రాక్టర్ల సంఘం పేరుతో ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ జలకళ కాంట్రాక్టర్లు తమకు బిల్లులు చెల్లించాలని లేని పక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ లేఖ సంచలనంగా మారింది.

‘అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ జలకళ పథకంలో భాగంగా తాము 600బోర్లకు పైగా డ్రిల్లింగ్ చేసి ఉన్నాము. దీనికి సంబంధించిన బిల్లులు 8 నెలలుగా చెల్లించలేదు. మేము మధ్యతరగతి కాంట్రాక్టర్లము. మేము మా స్థాయికి మించి బోర్లు వేసినాం. ఈ బిల్లులు త్వరగా చెల్లించకుంటే మాకు ఆత్మహత్యే శరణ్యం. మాకు ఫైనాన్స్, డీజిల్, కేసింగ్ పైపులు మరియు జియాలజిస్ట్ చార్జీలు చెల్లించమని తీవ్రంగా ఒత్తిడి ఉంది. మేము ఊరికి పోలేక ముఖము చాటేసుకున్నాము. విజయవాడలోనే కనిపించిన ప్రతీ ఆఫీసర్‌ను కాళ్ళా వేళ్లాపడి ప్రాధేయపడుతున్నాము. మీరు దయ ఉంచి మా బిల్లులు చెల్లించాల్సిందిగా కోరుతున్నాము’ అని లేఖలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ బోర్‌వెల్స్, ఉమామహేశ్వర బోర్‌వెల్స్, రామకృష్ణ బోర్‌వెల్స్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. అయితే ఈ లేఖపై తేదీ గానీ ఎవరి సంతకాలు కానీ లేవు. దీంతో ఈ లేఖ నిజంగానే వైఎస్ఆర్ జలకళ కాంట్రాక్టర్లు రాశారా లేక వేరెవరైనా పనా అన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే పంచాయతీ సర్పంచ్‌లు, ఇతర కాంట్రాక్టర్లు ఫ్లెక్సీలు పెట్టి మరీ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. బిల్లులు చెల్లించండి మహాప్రభో అంటూ మొత్తుకుంటున్నారు. తాజాగా వీరి జాబితాలోకి వైఎస్ఆర్ జలకళ కాంట్రాక్టర్ల సంఘం కూడా చేరినట్టుంది. మరి ఈ లేఖపై ప్రభుత్వం లేదా వైసీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ysr jalakala letter

Advertisement

Next Story