ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు.. ఎక్కడెక్కడంటే ?

by Harish |   ( Updated:2021-08-29 10:21:04.0  )
immages
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు భారీగానే డిమాండ్ పెరిగింది. అయితే, ఇదే సమయంలో ఈ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కొరత కూడా అదే స్థాయిలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బ్యాటరీ స్టోరేజ్, ఛార్జర్ డెవలప్‌మెంట్ సంస్థ ఈజెడ్4ఈవీ త్వరలో వినియోగదారులు ఎంచుకున్న ప్రదేశాల్లో ఈవీల కోసం ఆన్-డిమండ్ మొబైల్ ఛార్జింగ్ పరిష్కారాలను అందించనున్నట్టు వెల్లడించింది. రానున్న మూడు నెలల కాలంలో ‘ఈజీ ఉర్జా’ పేరుతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను ప్రారంభిస్తామని, వినియోగదారుల సమస్యలకు చెక్ పెడతామని కంపెనీ అభిప్రాయపడింది.

అంతేకాకుండా, వాహనదారులు మొబైల్ ఏటీఎంలను గుర్తిస్తున్నట్టుగా ఈ ఛార్జింగ్ స్టేషన్లను గుర్తించేందుకు వీలుంటుందని కంపెనీ తెలిపింది. దీని కోసం పట్టణాలు, నగరాలు, హైవే ప్రాంతాల్లో మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ ఛార్జింగ్ స్టేషన్లు ‘ఛార్జింగ్ ఆన్-డిమాండ్’, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారంగా పనిచేస్తాయని కంపెనీ వివరించింది. ‘ఈ స్టేషన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ వెసులుబాటు కూడా ఉంటుంది. ఇవి 24 గంటలు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా మొబైల్ ఛార్జింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఛార్జింగ్ మౌలిక సదుపాయాల సమస్యను పరిష్కరించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని’ కంపెనీ సీఈఓ సతీందర్ సింగ్ వెల్లడించారు.

Advertisement

Next Story