నమ్మించి బంగారం ఎత్తుకెళ్లిన భూతవైద్యుడు

by srinivas |
నమ్మించి బంగారం ఎత్తుకెళ్లిన భూతవైద్యుడు
X

దిశ, కుకునూరు: కుకునూరు మండల ఏజెన్సీలో కేటుగాళ్ళు తిష్టవేశారు. మాయ మాటలతో అమాయకులకు వల వేసి బురిడీ కొట్టిస్తున్నారు. అందినకాడికి దోచుకొని ఉడాయిస్తున్నారు. మండల పరిధిలోని దాచవరంలో మహిళను నమ్మించి ఆమె బంగారు ఆభరణాలను ఓ భూతవైద్యుడు లూటీ చేసిన ఘటన వెలుగుచూసింది. దాచవరం ఎస్సీ కాలానికి చెందిన పోసారపు రమణ శుక్రవారం ఉదయం తన ఇంట్లో పనుల్లో నిమగ్నమైంది. తన భర్త పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్ళాడు.ఈ క్రమంలో ఇంట్లో రమణ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ భూతవైద్యుడు ఆమె ఇంటికి వెళ్ళాడు.

ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇంట్లో లేనిపోని సమస్యలు, బాధలు మిమ్మల్ని పట్టిపీడిస్తున్నాయని భూతవైద్యుడు మాయమాటలతో రమణను నమ్మించాడు. ఈ క్రమంలో అవి తొలిగిపోవాలంటే ఇంట్లో ప్రత్యేక పూజలు చేయాలని, లేని యెడల తమ కుటుంబం ఇంకా చిక్కుల్లో చిక్కుకొని ఆర్థికంగా దెబ్బతింటుందని ఆమెను భూతవైద్యుడు నమ్మబలికించాడు. అతడి మాటలు నమ్మిన రమణ.. భయపడి పూజలకు ఒప్పుకోంది.

పూజ కోసం తన బంగారు ఆభరణాలను కోరగా రూ.15 వేలు విలువజేసే చెవుల జుకాలను భూతవైద్యుడికి ముట్టజెప్పింది. ఆ బంగారు జుకాలను గ్రామ పొలిమేరలో పెట్టి పూజలు చేసి వస్తానని వచ్చేలోపు స్నానం చేసి ఇంట్లో కొవ్వుతులు వెలిగించి ఉండమని భూతవైద్యుడు ఆమెకు చెప్పాడు. గంటలు గడుస్తున్నా భూతవైద్యుడు రాకపోవడంతో తాను మోసపోయానని విషయం గ్రహించిన ఆమె చుట్టుపక్కల గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. వారు పలుచోట్ల వెతకగా భూతవైద్యుడు ఆచూకీ కనిపించలేదు. ఎట్టకేలకు బాధితురాలు రమణ కుకునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా నెల రోజుల క్రితం దాచవరం గ్రామానికి చెందిన యాటగాని. కృష్ణ అనే వ్యక్తిని ఇదే తరహాలో మోసం చేసి కేటుగాళ్ళు రూ 30వేల నగదకు కన్నం పెట్టారు. గతంలో దాచవరం పరిసర ప్రాంతాల్లో క్షుద్రపూజలు చేసిన సంఘటనలు కూడా కలకలం రేపాయి. మళ్ళీ ఇప్పుడు భూతవైద్యుడు హల్ చల్ తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed