ఆన్‌లైన్‌లో కార్పొరేట్ స్కూళ్ల పరీక్షలు !

by Aamani |
ఆన్‌లైన్‌లో కార్పొరేట్ స్కూళ్ల పరీక్షలు !
X

దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని ప్రముఖ పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవేశాయి. కరోనా తీవ్రత తగ్గకపోవడం, మన రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేసే పరిస్థితులు కనిపించక పోతుండటంతో పలు కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులను, తల్లిదండ్రులను అలర్ట్ చేస్తున్నాయి. ఈ సమయంలో పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అందుకు సన్నద్ధం కావాలని యాజమాన్యాలు పేరెంట్స్‌కు మెసేజ్ పంపాయి.

లాక్‌డౌన్ ఎత్తివేత అనుమానమే ?

రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేయడం అనుమానంగానే కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 14 తర్వాత దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామని చెబుతున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. మరో రెండు వారాలు కొనసాగించేందుకు సీఎం ఆసక్తి చూపించడం వల్లనే విద్యార్థుల పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తల్లిదండ్రులే ఇన్విజిలేటర్లు

పదో తరగతి పరీక్షలు మినహా ఒకటి నుంచి 9వ తరగతి దాకా విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించేందుకు కార్పొరేట్ పాఠశాలలు సన్నద్దమవుతున్నాయి. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్‌లైన్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. అయితే విద్యార్థులకు పరీక్ష ప్రశ్నాపత్రాలు తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపుతామని యాజమాన్యాలు తెలుపుతున్నాయి. ఇదే క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షల సమయంలో తమ సొంత పిల్లలు అని భావించకుండా… పరీక్షలు రాసే విద్యార్థులుగా దృష్టిలో ఉంచుకుని ఇన్విజిలేటర్లుగా వ్యవహరించాలని కోరుతున్నారు. పరీక్ష రాసిన అనంతరం తల్లిదండ్రులు తిరిగి జవాబు పత్రాలను పాఠశాల యాజమాన్యాలకు వాట్సాప్‌లోనే పంపాలని కోరుతున్నారు. దీన్నిబట్టి ఈ ఏడాది ఒకటి నుంచి 9వ తరగతి పిల్లలకు బడులకు వెళ్లి వార్షిక పరీక్షలు రాసే పరిస్థితి కనిపించడం లేదు. లాక్‌డౌన్ పొడిగిస్తే పాఠశాలల చివరి రోజైన ఏప్రిల్ 24 దాటిపోయే అవకాశం ఉన్నందున పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించడం ఖాయమని తెలుస్తోంది.

Tags: corona virus effect, online, corporate school exams, parents invigilators, question papers on whatsapp, answer papers, lockdown, modi, kcr

Advertisement

Next Story

Most Viewed