కేసీఆర్‌ను ఢీకొట్టే సత్తా ఆయనకే ఉంది.. సత్యవతి కీలక వ్యాఖ్యలు

by Sridhar Babu |   ( Updated:2021-10-24 08:00:46.0  )
కేసీఆర్‌ను ఢీకొట్టే సత్తా ఆయనకే ఉంది.. సత్యవతి కీలక వ్యాఖ్యలు
X

దిశ, భద్రాచలం : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. సత్యవతి అండ్ టీమ్ తమకు పార్టీ కేటాయించిన కమలాపూర్ మండలం గునపర్తి, అంబాలా గ్రామాల్లో 280, 281 నంబర్ పోలింగ్ బూత్‌ల ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ దూసుకపోతున్నారు. అక్కడి నుంచి ఆమె ‘దిశ’తో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయం అన్నారు. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా, ప్రలోభాలు పెట్టినా కేసీఆర్ అన్యాయం చేసిన ఈటలకు ఈసారి ప్రజలు అండగా నిలవాలనే పట్టుదలతో ఉన్నారని తెలిపారు.‌‌

ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్న ఈటలకు అన్నివర్గాల మద్దతు లభిస్తున్నదని తెలిపారు.‌ ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మేము ఏమిచేస్తే అదే కరెక్టు అనే అహంతో రాష్ట్ర ప్రజల కష్టనష్టాలను పట్టించుకోకుండా పాలనచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటర్లు హుజూరాబాద్ తీర్పుతో సరైన గుణపాఠం చెప్పబోతున్నారని సత్యవతి జోస్యం చెప్పారు. ఈటెల గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వ అహంకారం తగ్గుతుందని ప్రజలు, అన్ని పార్టీలు ఆలోచన చేస్తున్నాయని ఆమె తెలిపారు. సమర్థుడైన ఈటల గెలిస్తే ప్రధాని మోడీతో సంప్రదింపులు జరిపి తన శక్తిసామర్థ్యాలతో కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఓటర్లలో వ్యక్తమౌతోందని కుంజా సత్యవతి తెలిపారు.

కేసీఆర్ ని ఢీకొట్టే సత్తా ఈటలకు మాత్రమే ఉందని జనం నమ్ముతున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారం ఉపయోగించి ఎన్నికల్లో గెలవడానికి కుట్రలు చేస్తోందని విమర్శించారు.‌ ఆ కుట్రలను, ప్రలోభాలను ప్రజలు త్రిప్పికొట్టి ఈటలను గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.‌ ఈ ప్రచార కార్యక్రమంలో కుంజా సత్యవతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా‌ అధ్యక్షులు కొనేరు సత్యనారాయణ (చిన్ని) జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట క్రాంతికుమార్, అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నక్కా కన్నయ్య, చర్ల మండల కన్వీనర్ పుగాకు పూర్ణ చందు, యువజన మోర్చా నాయకులు రాచకొండ అనిల్, భద్రాచలం పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొంటున్నారు.

Advertisement

Next Story