బిగ్ ‌బ్రేకింగ్.. కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్

by Shyam |   ( Updated:2021-07-13 03:35:59.0  )
బిగ్ ‌బ్రేకింగ్.. కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జడ్చర్ల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 1999, 2009 ఎన్నికల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో రెండు సంవత్సరాల క్రితం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. సామాజిక వర్గాల సమీకరణలు తదితర కారణాలతో ఆయనకు భారతీయ జనతా పార్టీ జిల్లా బాధ్యతలను ఏడాదిన్నర క్రితం అప్పగించారు. అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత ఒకటి రెండు కార్యక్రమాలు నిర్వహించగానే పార్టీ సిద్ధాంతాలు, నాయకుల తీరు పట్ల పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటూ వచ్చారు.

ఆ మధ్య భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు తనకు తగిన ప్రాధాన్యత లభించలేదని అసహనం చెందిన ఎర్ర శేఖర్ వెంటనే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అదే రోజు పార్టీ ముఖ్య నాయకులు కలగజేసుకుని సర్ది చెప్పడంతో తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. మళ్లీ రెండు మూడు నెలలలోపే తాను అధ్యక్ష బాధ్యతలు నిర్వహించలేనని మరోమారు రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడికి పంపారు. ఆ లేఖ ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. ఇటీవల జరిగిన జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా మంగళవారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపైనే చర్చించినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed