కరోనా.. ప్రతి 12 రోజులకు రెట్టింపు కేసులు

by Shamantha N |
కరోనా.. ప్రతి 12 రోజులకు రెట్టింపు కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ ఆంక్షలు సడలించే కొద్దీ దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రతరమవుతోంది. దేశవ్యాప్తంగా రోజుకు 6 వేలకుపైగా కొత్త కేసులు నమోదవడం సాధారణమైపోయింది. ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి కేసులు రెట్టింపవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 6,977 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే ఇప్పటివరకు అత్యధికం. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,38,845కి చేరింది. గడిచిన 24 గంటల్లో 154 మంది కరోనాతో మరణించడంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4,021కి చేరింది. ఈ నెల 12వ తేదీన దేశంలో కేసుల సంఖ్య 70 వేలుగా ఉంటే పన్నెండున్నర రోజుల వ్యవధిలో రెట్టింపైంది. చికిత్స అనంతరం కోలుకుంటున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ ఉంది. దేశంలో ఇప్పటివరకు 57,721 మంది కోలుకోగా యాక్టివ్ కేసులు 77,103 ఉన్నాయి.

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. మహారాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్కు దాటింది. దేశంలోనే ఇప్పటివరకు ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజే 2,436 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 52,667కి చేరింది. రాష్ట్రంలో గడిచిన 9 రోజులుగా 2 వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. రాజధాని ముంబైలో ఒక్కరోజే 1,430 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 31,789కి చేరింది. ముంబైలో ఇప్పటివరకు కరోనాతో 1,026 మంది మరణించారు. తమిళనాడులో ఒక్కరోజే 805 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 17,082కి, మొత్తం మరణాల సంఖ్య 118కి చేరింది. రాష్ట్ర రాజధాని చెన్నైలో ఒక్కరోజే 549 కేసులు నమోదుకాగా, నగరంలో ఇప్పటివరకు 11వేల కేసులు నమోదవడం గమనార్హం. గుజరాత్‌లో ఒక్కరోజే 405 కొత్త కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య14,468కి చేరింది. ఇప్పటివరకు ఇక్కడ వ్యాధి సోకి మొత్తం 888 మంది మరణించగా, 6,636 మంది కోలుకున్నారు. ఇక, ఏపీలో ఒక్కరోజే కొత్తగా 44 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,671కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 767 యాక్టివ్ కేసులున్నాయి.

Advertisement

Next Story

Most Viewed