ప్రజాధనం వృధా.. మట్టిలో కలిసిన నిధులు

by Aamani |
ప్రజాధనం వృధా.. మట్టిలో కలిసిన నిధులు
X

దిశ,చింతలమానేపల్లి : ప్రతి ఏటా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులకు నిధులు మంజూరు అవుతాయి.. ఆ నిధులను మండల స్థాయి నాయకులే గుత్తేదారులు గా అవతారమెత్తి తూతూ మంత్రంగా పనులు చేస్తుండడంతో పనుల్లో నాణ్యత లేకుండా పోతుంది. అధికారులు సైతం పర్యవేక్షణ చేయకపోవడంతో పనుల్లో ఏమాత్రం నాణ్యత లేకుండా పూర్తిగా రోడ్లు బురద మాయమవుతున్నాయి. తాజాగా చింతలమానేపల్లి మండలంలోని కర్జవెల్లి నుండి గూడెం వరకు బీటి రోడ్డు ఉండగా అది అంతరాష్ట్ర వారధిగా మారింది. ఈ రోడ్డు గుండానే నిత్యం అధిక లోడు కలిగిన వాహనాలు వెళ్తుండటంతో రోడ్డు పూర్తిగా గుంతలమయంగా అయింది.

అయితే రోడ్డుకు మరమ్మతులు చేపట్టేందుకు ప్రజాప్రతినిధుల ద్వారా రూ. 20 లక్షల వెచ్చించి గుంతల రోడ్డుపై మట్టిని వేసి చదును చేయగా అది పూర్తిగా బురద మయంగా మారి వచ్చి పోయే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. మంగళవారం గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాహనం ఇదే రోడ్డుపై బురదలో దిగబడితే మరో వాహనం తో బయటికి తీయాల్సిన పరిస్థితి నెలకొంది. గుంతలు పడ్డ రోడ్డుపై మరమ్మతులు చేపడుతారంటే పూర్తిగా రోడ్డును బురదమయం చేయడం ఏంటని, వచ్చిన నిధులను బురద పాలైనట్లు ప్రయాణికులు, మండల వాసులు వాపోతున్నారు. గుత్తేదారుల తీరుపై మండలంలో పలు విమర్శలకు తావిస్తోంది. పంచాయతీరాజ్ అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

రోడ్డు పనులు నాణ్యతగా లేకపోవడంతోనే సమస్య..: గంగిరెడ్డి తిరుపతి రెడ్డి, గూడెం

కర్జవెల్లి నుండి గూడెం వరకు ఉన్న బీటీ రోడ్డుపై మట్టిని పోశారు కానీ నాణ్యతగా లేకపోవడంతోనే పూర్తిగా ఇబ్బందిగా మారుతుంది. దీంతో వచ్చి పోయే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా పంచాయతీరాజ్ అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారమయ్యేలా చూడాలి.

Advertisement

Next Story