KTR : మహిళా సంఘాల అడ్డగింతపై క్షమాపణలు చెప్పాలి : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : మహిళా సంఘాల అడ్డగింతపై క్షమాపణలు చెప్పాలి : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : నిజనిర్ధారణకు లగచర్ల(Lagacharla)వెలుతున్న మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. లగచర్లలో నిర్బంధాన్ని ఎత్తివేసి.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరారు. లగచర్లలో అర్థరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండే కాదు..పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోందని, వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోందని నిలదీశారు. సీఎం సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి ? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా..?

లేక లగచర్ల.. చైనా బార్డర్లో ఉన్న కల్లోలిత ప్రాంతమా అని మండిపడ్డారు. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారని, కొడంగల్ కు వెళ్లే అన్ని దారుల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేశారన్నారు. మీరెంత దాచే ప్రయత్నం చేసినా.. నిజం దాగదని, ఇప్పటికే లగచర్లలో కాంగ్రెస్ సర్కారు కిరాతకం ఢిల్లీకి చేరిందని, దేశ రాజధానిలో మీ అరాచక పర్వంపైనే తీవ్ర చర్చ జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే కాంగ్రెస్ సర్కారు తప్పుచేసినట్టు ఒప్పుకున్నట్టే లెక్కేనని చురకలంటించారు.

Advertisement

Next Story