అంతరిక్షంలోకి.. తొలిసారి పారా ఆస్ట్రోనాట్

by Shyam |   ( Updated:2021-06-28 01:13:36.0  )
అంతరిక్షంలోకి.. తొలిసారి పారా ఆస్ట్రోనాట్
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను 1957లో అప్పటి సోవియట్ యూనియన్ (యూఎస్‌ఎస్‌ఆర్) ప్రయోగించింది. అదే ఏడాది స్పుత్నిక్-2తో పాటు అందులో లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి పంపారు. తద్వారా రోదసీలో ప్రయాణించిన తొలి జంతువుగా లైకా పేరుగాంచింది. రష్యాకు చెందిన వ్యోమగామి యూరీ గగారిన్ 1961, ఏప్రిల్ 12న వొస్తోక్-1 అనే అంతరిక్ష నౌకలో ప్రయాణించిన తొలి యాత్రికుడు కాగా.. సోవియట్ యూనియన్‌కు చెందిన వాలెంటినా తెరెష్కోవా మొదటి మహిళగా అంతరిక్ష వీధుల్లో ఎన్నో విజయాలు, రికార్డులు సృష్టించారు. అయితే ఇప్పటివరకు ఒక్క దివ్యాంగుడు కూడా స్పేస్‌లో అడుగుపెట్టలేదు. దాంతో ‘అంతరిక్షం’ ఎవరి ఆస్తి కాదని చెబుతూ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రపంచంలో మొట్టమొదటి శారీరక వికలాంగ వ్యోమగామిని స్పేస్‌కు పంపనున్నట్లు ఆ స్పేస్ ఏజెన్సీ అధ్యక్షుడు జోసెఫ్ అష్బాచెర్ ప్రకటించారు.

‘అందరికీ అంతరిక్షం’ అనే నినాదంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఓ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగ వ్యోమగామిని మొదటిసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నట్లు స్పేస్ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అక్కడ అడుగుపెట్టేందుకు తాము సిద్ధమేనంటూ దాదాపు 22 వేల మంది పారా ఆస్ట్రోనాట్స్ నుంచి దరఖాస్తులు వచ్చాయి. వ్యోమగాముల ఎంపిక కోసం చేపట్టిన రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ముగియగా 22 మందిని ఫైనల్ లిస్ట్‌కు సెలెక్ట్ చేశారు. ఇక అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వచ్చే నెలలో తమ సంస్థ బ్లూ ఆరిజిన్ అభివృద్ధి చేసిన (‘న్యూ షెపర్డ్ వ్యోమనౌక’) సొంత రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు.

అంతరిక్ష ప్రయోగాల్లో పోటీ చాలా వేగంగా పెరుగుతోంది. అందువల్ల ఈ వేగాన్ని అందుకోకపోతే మేము వెనుకబడిపోయే అవకాశం ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మా స్పేస్ స్టార్టప్‌ల సంఖ్యను పెంచడానికి వెంచర్ క్యాపిటలిస్టులతో కలిసి పనిచేయనున్నాం. అయితే అంతకు ముందే ఏజెన్సీని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ESA బడ్జెట్ 7బిలియన్ యూరోలుగా ఉంది. ఇది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా బడ్జెట్‌లో మూడో వంతు మాత్రమే. ఈఎస్‌ఏ సంవత్సరానికి ఏడు లేదా ఎనిమిది ప్రయోగాలు చేస్తుంటే.. నాసా మాత్రం ఏకంగా 40 ప్రయోగాలు చేపడుతోంది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేపట్టాలి. యూరోపియన్ వ్యోమగాములు ఒకే రోజు రెండు వేర్వేరు మూన్‌బేస్‌లపై ఒకేసారి సర్వీస్ చేసే అవకాశం తప్పకుండా వస్తుంది.
– అష్బాచెర్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అధ్యక్షుడు

Advertisement

Next Story