- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటల సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు ప్రజలకు సేవ చేయడం, వారి తలలో నాలుకగా మారడం, కమిట్‌మెంట్ లాంటివి రాజకీయాల్లో ప్రామాణికంగా ఉండేవని, ఇప్పుడు డబ్బు మాత్రమే ఏకైక అర్హతగా మారిందని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. పంచాయతీ మొదలు పార్లమెంటు వరకు టికెట్ ఇవ్వాలంటే ‘ఎంత డబ్బు ఉంది, ఎంత ఖర్చు పెట్టగలవు‘ అనే అంశాలు నిర్ణయాత్మకంగా మారాయని, ఇది సమాజానికి మంచిది కాదన్నారు. సంపద కొద్దిమంది దగ్గర కేంద్రీకృతం కావడంతో రాజకీయ పార్టీలనే శాసిస్తున్నాయని అన్నారు.
నగరంలో ఆదివారం జరిగిన ‘101 మంది మేధావులు, ఉద్యమకారులు – సామాజిక న్యాయ మేధోమధనం‘ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈటల రాజేందర్ తన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశారు. సంపద ఆకలి తీర్చేదిగా ఉండాలిగానీ మెజారిటీ ప్రజలకు ఏమీ లేకుండా చేయడంగా మాత్రం ఉండకూడదని, అలాంటిది సమాజానికి ఎన్నటికీ వాంఛనీయం కాదన్నారు. కొంతకాలం సమాజం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించవచ్చుగానీ ఏదో ఒకనాడు ఉద్యమం తప్పదని, ఈ ఆర్థిక అసమానతలు బద్దలు కాక తప్పదన్నారు
సంపద వ్యక్తుల దగ్గరే మూలుగుతుండడంతో పేదరికం పెరిగిందని, సమాజంలో అంతరాలు, వైరుధ్యాలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయని, చివరకు ఇది సమాజంలో అశాంతికి కారణమవుతుందని, ఉద్యమాలకు ఊపరి పోస్తుందని, ఈ పరిస్థితులు బద్దలు కాక తప్పదని మంత్రి ఈటల తన ప్రసంగంలో పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు తగ్గాలని, రిజర్వేషన్ల అవసరం ఉండొద్దని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేర్కొన్నారని, కానీ 75 ఏళ్ళు అయినా ఇంకా ఎస్సీల్లో ఏబీసీడీ వర్గీకరణ, అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు లాంటి డిమాండ్లతో ఉద్యమాలు చేయాల్సి వస్తోందని, సమాజం అభివృద్ధి చెందుతోందని మనం భావించగలమా అని ప్రశ్నించారు.
మనిషి, సమాజం ఉన్నంత వరకు వైరుధ్యాలు, అంతరాలు ఉంటాయని, అవి లేనినాడే అందరూ ఆమోదించే సమాజంగా గుర్తించగలమన్నారు. 75 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి సమావేశాలు పెట్టుకునే దుస్థితి కలగడం బాధాకరమన్నారు. కుటుంబాలను పోషించలేక విషం తాగి చనిపోతున్నారని, ఆకలి బాధలతో తనువు చాలిస్తున్నారని, అంబేద్కర్ ఆశించిన సమాజం ఇది కాదని అన్నారు. కేంద్రీకృతమైన ఆర్థిక విధానం పేదరికానికే దారి తీస్తుందని, రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని తుంగలో తొక్కి నాశనం చేసినదాని ఫలితమే ఇది అని అన్నారు. ‘ఫలానా ఆయన ఆస్తి ఇంత.. ‘ అని విన్నప్పుడు చాలా బాధేస్తుందని, పైగా దానికి తెలివి, శ్రమ, మేధస్సు, పెట్టుబడి లాంటివాటిని జోడించి సమర్ధించే వ్యాఖ్యలు చేస్తే ఇంకా బాధేస్తుందన్నారు. ‘మనిషికి ఉండే ఐదు వేళ్ళూ ఒకేలా ఉంటాయా‘ అంటూ వేదాంతం తరహాలో ఎదురు ప్రశ్న రావడం మనుషులను మనీ రూపంలో ఎంతగా విడదీస్తుందో అర్థమవుతోందన్నారు. ప్రజలను దోచుకోకుండా కోట్లాది రూపాయల సంపద పోగుపడడం సాధ్యమే కాదన్నారు.
ఇప్పటికీ సమాజంలో పేదలకు, సంపన్నులకు వేర్వేరు స్కూళ్ళు ఉన్నాయని, అలాంటివి ఉండొద్దని యూనిఫారం పెట్టినా తప్పడంలేదన్నారు. దేశంలో రోజురోజుకూ ఆకలి, అణచివేత, వివక్ష, దరిద్రం పెరుగుతోందన్నారు. చివరకు ఓటు కూడా అమ్ముడుపోతూ ఉన్నదని, ఎంతకు కొందాం, ఎంతకు అమ్ముకుందాం అనేది తయారైందని, ఇది ఎన్నడూ సమాజానికి మంచిది కాదన్నారు. ఒక హక్కుగా వచ్చిన ఓటు ప్రజల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి, స్వాభిమానానికి నిదర్శనమని, దాన్ని అమ్ముకోవడమంటే వీటిని అమ్ముకోవడమేనని, కానీ రాజకీయాలు చివరకు ఆ స్థాయికి చేరుకుని సమాజాన్ని ఆ విధంగా మార్చాయని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సిగ్గుతో చెప్తున్నా ఇది పచ్చి నిజం అన్నారు. ఫలానావాడు అమ్ముడుపోతున్నాడు అని కూడా చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. హక్కును, స్వాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని అమ్ముకోలేం, కొనుక్కోలేం అనేది ఒకప్పటి మాట మాత్రమేనని, ఇప్పుడు అది మార్కెట్లో సరుకైపోయిందన్నారు.