చావునైనా భరిస్తా.. ఈటల సంచలన నిర్ణయం

by Anukaran |   ( Updated:2021-05-03 01:02:09.0  )
Etala Rajender
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హుజురాబాద్ ప్రజలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పథకం ప్రకారమే తనపై కుట్ర చేశారని.. భూ కబ్జా ఆరోపణలు, అసెన్డ్ భూముల ఆక్రమణ, వేల కోట్లు కొల్లగొట్టారంటూ తెలంగాణ ప్రజలు తనను అసహ్యించుకునేలా ప్రచారం చేశారన్నారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. చావు నైనా భరిస్తా కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోనని తేల్చిచెప్పారు.

19 సంవత్సరాల పాటు కేసీఆర్‌, పార్టీ కోసమే పనిచేశానని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ఆయన శిష్యరికంలోనే ఎదిగానని.. గతంలో పార్టీ ఆదేశిస్తే పదవులకు రాజీనామా చేశానని.. ఉద్యమ నేతగా, మంత్రిగా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే పని ఎప్పుడూ కూడా చేయలేదన్నారు. అటువంటిది భూ కబ్జా ఆరోపణల విషయంలో కనీసం తనను సంప్రదించలేదని ఈటల వాపోయారు. తనకు సంబంధం లేని భూముల్లో సర్వేలు చేసి.. ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టి, ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారని ప్రచారం చేస్తున్నారన్నారు. అరుపులకు, కేసులకు భయపడేంత చిన్నవాడు ఈటల కాదని.. దీనిపై తప్పకుండా కోర్టుకెళ్లి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

Advertisement

Next Story