ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ సీక్రెట్ ఆపరేషన్..!

by Anukaran |
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ సీక్రెట్ ఆపరేషన్..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ నాయకుని పాత్ర ఎంత ? చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోతున్న ఆ నాయకుడు ఏం సమీకరణాలు చేస్తున్నాడు? ఆయన చేస్తున్న సీక్రెట్ ఆపరేషన్ ఏంటీ అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రెబల్స్ వెనక ఆయన హస్తం ఉందా..? ఈ కారణంగానే వీరు అధికార పార్టీ ముంగిట బెల్స్ మోగిస్తున్నారా అన్న చర్చ తీవ్రంగా సాగుతోంది.

ఈటల చుట్టే రాజకీయం..

అధిష్టానాన్ని ఎదురించి ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సైలెంట్‌గా తన పనిని కానిచ్చేస్తున్నట్టుగా ఉంది. ఎన్నికల సమయంలోనే ఫలితాల తరువాత నేనేంటో చూపిస్తా, నా లక్ష్యాలను సాధిస్తా, అధికార టీఆర్ఎస్ పార్టీని ముప్పు తిప్పలు పెడతానని హెచ్చరించారు. ఆయన గెలిచి నెల రోజులు తిరగకముందే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. బరిలో నిలిచిన రెబల్స్‌కు తనవంతు మద్దతు అందిస్తున్నారన్న ప్రచారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో సాగుతోంది. నామినేషన్లు వేసిన ఒకరిద్దరు ముందుగానే ఈటల ఆశీస్సులు తీసుకోగా మరికొంతమంది ఆయన మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఉద్యమ కాలం నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిరిగిన రాజేందర్ వ్యక్తిగత పరిచయాలు కూడా ఎక్కువనే చెప్పాలి. జిల్లా అధ్యక్షునిగా కూడా పని చేసిన ఆయన పార్టీ వ్యవహారాల్లో కీలకంగా పనిచేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రెండు సార్లు మంత్రిగా పని చేసిన రాజేందర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరింతపట్టు బిగించారు. అప్పటి వ్యక్తిగత అనుబంధాలను ఆసరాగా చేసుకుని అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారని కూడా భావిస్తున్నారు. అయితే ఆయన చేసే సీక్రెట్ ఆపరేషన్‌తో ఏఏ అభ్యర్థులకు అనుకూలంగా ఓటర్లను మారుస్తారన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

Advertisement

Next Story

Most Viewed