- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సడలింపులు ఇచ్చామని బయటకు రాకండి: ఈటల
దిశ, న్యూస్ బ్యూరో: “జీవనోపాధి కోల్పోకూడదనే ఉద్దేశంతో మాత్రమే లాక్‌డౌన్‌ని ఎత్తి వేశాం. ప్రజలు అవసరం లేకున్నా బయటికి వచ్చి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దు. లాక్‌డౌన్ సడలించడం వల్ల ప్రజలు ఎక్కువ మంది బయటకు వస్తున్నారు. ఫలితంగా వైరస్ వ్యాప్తి పెరిగింది” అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ చాలా మందిలో లక్షణాలు బహిర్గతం కావడంలేదని, రోడ్లమీద తగిన జాగ్రత్తలు తీసుకోకుండా తిరిగితే వయసు మీదపడినవారికి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కరోనా సోకే ప్రమాదం ఉందని, చివరకు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తి పెరుగుతుండడం, సోమవారం నుంచి మరిన్ని సడలింపులు వస్తుండడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి సచివాలయంలో ఆదివారం సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోరారు. మరణాలు తగ్గించడానికి కృషి చేస్తున్నామని, భూమి మీద ఏ మందు ఉన్నా తెచ్చి చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయినా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
జిల్లా కేంద్రాల్లో ఐసొలేషన్ సౌకర్యం
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో కూడా.. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, చికిత్స చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోనే ఐసోలేషన్‌లో ఉండేలా కూడా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ పట్ల ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా కొంత మంది ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గడం లేదన్నారు. హోమ్ క్వారంటైన్‌లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. ప్రజల్లో ఉన్న భయం వారిని హాస్పిటల్ నుంచి బయటకి రానివ్వడం లేదని మంత్రి గుర్తుచేశారు. చిన్న ఇళ్ళు ఉన్నవారు, ఇంట్లో ప్రత్యేక గది వసతి లేనివారు హాస్పిటల్‌లోనే ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ఇదే సమయంలో పాజిటివ్ పేషెంట్ ఉండే ఇంటికి ఆనుకుని ఉన్న ప్రజలు తమకు కూడా వైరస్ సోకుతుందేమో అనే భయం ఉందని, ఈ కారణంగానే చాలామంది హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు.
స్థానిక జియగూడలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుందని, ఓ వ్యక్తి కుటుంబంలో ముగ్గురికి వైరస్ సోకడంతో ఇంట్లోనే ఉండేందుకు నిర్ణయించుకున్నా.. కాలనీలో ఇరుగుపొరుగువారు ఇబ్బంది పెట్టారని, తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటల్‌కి రావాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితులతో ఆసుపత్రుల మీద భారం పెరుగుతుందని, ఫలితంగా మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తక్కువ లక్షణాలు ఉన్న, లక్షణాలు లేకుండా ఉన్న పాజిటివ్ పేషెంట్లను ఇంట్లో ఉంచి చికిత్స అందించడానికి ప్రజలు, సమాజం సహకరించాలని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.