హుజూరాబాద్‌లో దొంగ ఓట్లు.. గెలిచేది నేనే అంటోన్న ఈటల రాజేందర్

by Anukaran |
హుజూరాబాద్‌లో దొంగ ఓట్లు.. గెలిచేది నేనే అంటోన్న ఈటల రాజేందర్
X

దిశ, కమలాపూర్: హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచేందుకు.. పోలింగ్ బూతుల్లో ఓట్లను గజిబిజి చేసి, దొంగ ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంబంధిత ఎన్నికల అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేశామన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడారు.

ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌లో కూర్చున్న కేసీఆర్.. కుట్రలు-కుతంత్రాలు పన్నుతున్నారని.. వాటిని అమలు చేసే బాధ్యతను హరీష్ రావుకు అప్పగించారని ఈటల ఆరోపించారు. హరీష్ రావుకు తోడుగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్ పర్సన్‌లు, ప్రజా ప్రతినిధులను వందల సంఖ్యలో హుజూరాబాద్‌కు తరలించారని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజా ప్రతినిధులకు పార్టీ కండువాలు కప్పి కారెక్కిస్తున్నారని ఈటల మండిపడ్డారు. స్వయంగా మంత్రులే డీసీఎం వ్యాన్‌లలో మద్యం, చికెన్ పట్టుకుని వచ్చి వందల మంది క్యాటరింగ్ సిబ్బందితో ఊర్లకు.. ఊళ్ళు దావతులు ఇస్తున్నారని చెప్పారు.

వందల సంఖ్యలో ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి ఎవరెవరు ఈటల కోసం బీజేపీలో తిరుగుతున్నారో తెలుసుకొని వారి వ్యాపార, ఉద్యోగ, ప్రభుత్వ అనుబంధంగా ఉన్న వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని రాజేందర్ ఆరోపించారు. డబ్బు సంచులతో ఇక్కడకు వచ్చి కోట్ల రూపాయలతో కుల సంఘ భవనాలకు, కుల పెద్దలకు, దేవాలయాలకు, సంఘాలకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.

గత ఏడేండ్లలో ఏనాడు దళిత జీవితాల్లో తొంగి చూడని కేసీఆర్.. ఉపఎన్నిక రాగానే ఓట్ల కోసం దళిత బంధుతో కొత్త అవతారం ఎత్తి వారిని మభ్య పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఏదైనా పథకం ప్రవేశపెడితే రాష్ట్రమంతా వస్తుంది కానీ, తెలంగాణలో ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తుందా? ఇటువంటి పద్ధతి ఎక్కడైనా ఉందా? అంటూ ఈటల ప్రశ్నించారు.

ఎటువంటి ఆంక్షలు, అధికారుల ప్రమేయం లేకుండా యావత్తు తెలంగాణకు దళిత బంధు ఇవ్వాలని.. హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్పంచులకు, ఎంపీటీసీలకు బిల్లుల చెల్లింపులు ఎలా చేస్తున్నారో, మిగతా జిల్లాల్లో కూడా సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు బిల్లులు అలాగే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, ఉద్యోగులు, మీడియా అందరూ కలిసి ఈ పరిస్థితిని ప్రజలకు వివరించాలని కోరారు. ఏది ఏమైనా.. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా.. ఈటల రాజేందర్‌ను గెలిపించుకోవాలని ప్రజలందరూ భావిస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేస్తూనే.. ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story