ఈటల కీలక వ్యాఖ్యలు.. ముదిరాజులను కదిలిస్తే షాక్ తప్పదు

by Sridhar Babu |   ( Updated:2021-10-08 05:33:25.0  )
ఈటల కీలక వ్యాఖ్యలు.. ముదిరాజులను కదిలిస్తే షాక్ తప్పదు
X

దిశ, జమ్మికుంట : ముదిరాజులను కదిలిస్తే తేనె తుట్టెను కదిలించినట్టేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన ముదిరాజుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని కులాలు, మతాల వారు తనకు మద్దతు తెలుపుతూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. 18 ఏండ్ల కొట్లాట వేరని, ఇప్పటి కొట్లాట వేరన్నారు. ఆ కొట్లాట తెలంగాణ తల్లి విముక్తి కోసమని, ఇప్పటి కొట్లాట కేసీఆర్ చేపడుతున్న అన్యాయం, అక్రమాలపై అని పేర్కొన్నారు. కురుక్షేత్రంలో యోధానుయోధులు కౌరవుల వైపు ఉన్నా, ధర్మం పాండవుల వైపు ఉన్న కారణంగా వారు గెలిచారన్నారు, ఇప్పుడు కూడా ధర్మం వైపు ఉన్న మనం గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

కరోనా సమయంలో శవాలను కూడా కుటుంబ సభ్యులు తీసుకెళ్లని సందర్భంలో.. ఆ శవాల మధ్య ఉన్న వాడినని, అప్పుడు తెలంగాణ సమాజమంతా నన్ను చూసి హర్షిస్తూ ఉంటే కేసీఆర్ మాత్రం బాధ పడి, కంట్లో పెట్టుకుని నన్ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేశారని చెప్పుకొచ్చారు. తెరాస పార్టీ నుండి బయటికి పోవాలంటే బాధ అనిపించిందని, నా అంతట నేను రాజీనామా చేయలేదని, వాళ్ళు డిమాండ్ చేస్తే రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ సీఎం కుర్చీ మీద కన్ను వేసిండని హరీష్ పలు సందర్భాల్లో అంటున్నాడని, కానీ నేను వేయలేదు అని క్లారిటీ ఇచ్చారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ ఎందుకు సీఎం కాకూడదు ప్రశ్నించారని పేర్కొన్నారు.

అక్రమాలను ఎదిరించే బిడ్డగా ఉంటానని కేసీఆర్ ఛాలెంజ్ చేశారు. నా గన్ మెన్‌‌ను తీసివేసిండు…నేను పోలీసులను నమ్ముకున్న వాన్ని కాదు, ప్రజలను నమ్ముకున్న వాన్నని, నయీం లాంటి వాళ్ళతో చంపిస్తా అంటే కూడా భయపడలేదని, ఇప్పుడు భయపడతామా ? అంటూ వివరించారు. కేసీఆర్‌ను తెలంగాణ సమాజంలో దోషిగా నిలబెడతామనని చెప్పారు. నేను గెలిస్తే ఆకలి కేకలు లేని ఆత్మగౌరవ తెలంగాణ వస్తుందని, హరీష్ మాయం అయ్యేది నేను కాదు.. మీ కుటుంబం, మీ పార్టీ అని ఘాటుగా విమర్శించారు.

కమలం పువ్వు‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. ఈటలను భారీ మెజారిటీతో గెలిపించే భాధ్యత మనందరిదని, కేసీఆర్‌కు బుద్ది చెప్పాలని, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు మా వాళ్లకు కూడా ఇవ్వాల్సిందే నని కేసీఆర్ మీదనే ఒత్తిడి తెచ్చిన నాయకుడు ఈటల అని గుర్తు చేశారు. కార్యక్రమంలో బాబు మోహన్, ముదిరాజ్ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed