సీఎం కేసీఆర్‌కు ఈటల అల్టిమేటం.. 31న తేలుస్తా నీ సంగతి..!

by Sridhar Babu |
సీఎం కేసీఆర్‌కు ఈటల అల్టిమేటం.. 31న తేలుస్తా నీ సంగతి..!
X

దిశ, హుజురాబాద్ : సీఎం కేసీఆర్‌కు మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అల్టిమేటం జారీ చేశారు. ఈనెల 31వ తేదీ నుంచి దళితబంధు పథకాన్ని అమలు చేయాలన్నారు.లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతానని అన్నారు. శనివారం పట్టణంలోని పలు వీధుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశానని, అయినా తనను ఒంటరిని చేసి గెంటేశారని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆ సమయంలో తనను వేరే పార్టీలో చేరాలని ఒత్తిడి చేసినా టీఆర్ఎస్‌లో కొనసాగానని చెప్పుకొచ్చారు. తాయిలాలు, తాంబూలాలకు తానెన్నడూ తలొగ్గలేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టిన కేసీఆర్‌నే తెలంగాణ నుండి తరిమికొట్టే రోజులు వస్తాయన్నారు. ఎర్రబెల్లి, మల్లారెడ్డి, సబితా లాగా తాను మధ్యలో వచ్చినవాడిని కాదన్నారు. అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. తెలంగాణాలో అభివృద్ధి చెందినది ఒక్క కల్వకుంట్ల కుటుంబం మాత్రమే అని అన్నారు.ఈటలకు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపి కేసీఆర్ తన అహంకారం చాటుకున్నారని విమర్శించారు. నియోజక అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన ఈటలను గెలిపించుకుందామా? కేసీఆర్ నిలబెట్టిన డమ్మీ అభ్యర్థినా? అని అడిగారు. ఈ నిర్ణయం హుజురాబాద్ ఓటర్ల చేతిలో ఉందన్నారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాది కృష్ణా రెడ్డి, మండల అధ్యక్షుడు కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story