రాయలసీమ దుర్భిక్ష నివారణ కార్పొరేషన్ ఏర్పాటు

by srinivas |
రాయలసీమ దుర్భిక్ష నివారణ కార్పొరేషన్ ఏర్పాటు
X

దిశ, ఏపీ బ్యూరో: రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగు నీటి ఎద్దడిని కట్టడి చేసేందుకు అమలు చేయనున్న పథకాల కోసం రుణం సేకరించేందుకు ప్రభుత్వం రాయలసీమ దుర్భిక్ష నివారణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో తాగు, సాగు నీరందించేందుకు వీలుగా ఈ కార్పొరేషన్‌ ద్వారా పథకాలు చేపట్టనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

కార్పొరేషన్‌కు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ సూచనల మేరకు.. ఏపీ రాయలసీమ దుర్భిక్ష నివారణ కార్పొరేషన్‌ లేదా మరేదైనా పేరును ఖరారు చేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆయా పథకాల కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ కింద ఈ కార్పొరేషన్‌ పనిచేస్తుందని తెలిపారు. కార్పొరేషన్‌కు రూ.5 కోట్ల పెట్టుబడి నిధిని ఏర్పాటు చేశారు. దీనిలో జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పేరిట 49,99,994 షేర్లుంటాయి. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ ఈఎన్‌సీ, కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి సీఈల పేరిట ఒక్కో షేర్‌ ఉంటాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed