ధరణిలో తప్పులు నమోదు.. సరిదిద్దడం కష్టమే

by Anukaran |   ( Updated:2021-01-11 11:17:21.0  )
ధరణిలో తప్పులు నమోదు.. సరిదిద్దడం కష్టమే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ సర్వీసులను సత్వరంగా, పారదర్శకంగా అందించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యాలకు దూరంగా ధరణి పోర్టల్ తయారైనట్లు తెలుస్తోంది. ఎవరైనా, ఎక్కడి నుంచైనా భూ రికార్డులను పక్కాగా వీక్షించేందుకు అనువుగా ఉండేటట్లుగా పోర్టల్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. పోర్టల్ పాత భూ రికార్డులకు దూరంగానే ఉందని తెలుస్తోంది. ఏ ఒక్క గ్రామంలో 100 శాతం పక్కా అని చెప్పే పరిస్థితులు కనిపించడం లేదు. సర్వే నెంబర్లు, ధరణి పోర్టల్‌తో సరిపోలడం లేదు. పోర్టల్ ద్వారా రెవెన్యూ సర్వీసులకు సాంకేతిక సహకారం అందడం లేదు. వారం రోజులలో పెండింగ్ మ్యూటేషన్లు, డిజిటల్ సంతకాలు పూర్తి చేయాలని ఆదేశించినా అడుగు ముందుకు పడలేదు. మిగతా సేవలకు టెక్నికల్ సమస్యలు వేధిస్తున్నాయి. రెవెన్యూ విలేజ్ పాత డేటాకు, ధరణిలో నమోదు చేసిన డేటాకు సరిపోల్చడం కష్టంగా మారింది. ఇదే విషయాన్ని సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్షలో కొందరు కలెక్టర్లు విన్నవించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొన్ని గ్రామాలకు సంబంధించిన కేస్ స్టడీస్‌ను ఆయనకు అందజేశారని సమాచారం. సీఎం వాటిని సీఎంఓ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారుల చేతులలో పెట్టారని తెలిసింది.

విభిన్నంగా విస్తీర్ణాలు

మూడేండ్లుగా కష్టపడి ధరణి పోర్టల్ రూపొందించారు. కొందరు ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా డేటాను సక్రమంగా రూపొందించలేకపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ వ్యత్యాసాలను గుర్తించారు. వ్యవసాయం, వ్యవసాయేతర భూముల విస్తీర్ణంలోనూ తేడాలు ఉన్నాయి. నాలా కన్వర్షన్ చేసిన భూముల వివరాలు సక్రమంగా లేవు. ధరణిలో నమోదు చేసిన భూ విస్తీర్ణానికి, వాస్తవ భూ విస్తీర్ణానికి మధ్య వ్యత్యాసం ఉందని స్పష్టమైంది. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వివరించారు. కొన్ని సర్వే నెంబర్లు అదృశ్యమయ్యాయి. ప్రభుత్వ భూములు, పబ్లిక్ ప్రాపర్టీస్ వివరాలలో తేడాలు కనిపిస్తున్నాయి. పార్టు బి కింద నమోదు చేసిన ఖాతాలు, వాటి విస్తీర్ణం వంటివి క్లియర్ చేస్తే కూడా ఇప్పటికే నమోదైన విస్తీర్ణాలతో సరిపోలే అవకాశాలు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. సాదాబైనామాలు, పెండింగ్ పౌతిలు, పెండింగ్ మ్యూటేషన్లు, పీఓటీ కేసులు, ఇనాం భూములు, కోర్టు కేసులు, వాటి అప్పీళ్లు, ఆర్ఎస్ఆర్‌ల్లో తేడాలు, సీలింగ్ భూములు, వక్ఫ్, దేవాదాయ, భూదాన్, ఎవాక్యూ వంటి భూములకు సంబంధించిన అనేక వివాదాలు పెండింగులోనే ఉన్నాయి. వీటన్నింటికీ సేత్వార్, ఖాస్రా పహాణీలలోని భూ విస్తీర్ణాలకు మరింత తేడాలు వచ్చేటట్లుగా ఉన్నాయి. సులభతర వాణిజ్యంలో మరింత ర్యాంకింగ్‌ను సాధించాలంటే సమగ్ర భూ సర్వే అనివార్యంగా తెలుస్తోంది. నిపుణులు, రిటైర్డ్ అధికారులు అదే సూచిస్తున్నారు.

ఒక ఊరి ధరణి కథ

మొత్తం సర్వే నెంబర్లు: 350

ధరణిలో సరిగ్గా నమోదైన సర్వే నెంబర్లు (సాగు భూమి): 190
వ్యవసాయం, వ్యవసాయేతరాలలో నమోదు: 0
వాస్తవానికంటే అధికంగా నమోదైన సర్వే నెంబర్లు: 10
వాస్తవానికంటే తక్కువగా నమోదైన సర్వే నెంబర్లు: 25
పోర్టల్‌లో అదృశ్యమైన సర్వే నెంబర్లు: 10
మిస్ చేసిన భూ విస్తీర్ణం: 140 ఎకరాలు
డిజిటల్ సంతకం పెండింగులో ఉంచిన విస్తీర్ణం: 80 ఎకరాలు
పెండింగ్ మ్యుటేషన్ల భూ విస్తీర్ణం: 20 ఎకరాలు
పౌతి పెండింగ్ భూ విస్తీర్ణం: 10 ఎకరాలు
సాదాబైనామాల ద్వారా పెండింగ్ విస్తీర్ణం: 10 ఎకరాలు

Advertisement

Next Story

Most Viewed