టెస్టు సిరీస్ ఇంగ్లాండ్ వశం

by Shyam |   ( Updated:2021-01-25 10:28:59.0  )
టెస్టు సిరీస్ ఇంగ్లాండ్ వశం
X

గాలె: గాలె వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంకపై ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 339/9తో నాలుగో రోజైన సోమవారం బ్యాటింగ్ సాగించిన ఇంగ్లాండ్ మరో 5 పరుగులు చేసి, 344 స్కోరుకే ఆలౌట్ అయింది. దీంతో అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులు చేసిన శ్రీలంకకు 37 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక జట్టు, ప్రత్యర్థి బౌలర్లు డామ్ బెస్ (4/49), జాక్ లీచ్(4/59)ల దెబ్బకు 126 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక జట్టులో ఎంబుల్డేనియా ఒక్కడే (40) రాణించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగుల ఆధిక్యంతో కలిపి ప్రత్యర్థి ముందు 163 పరుగులను ఉంచింది.

164 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను లసిత్ ఎంబుల్డేనియా (3/73) భయపెట్టాడు. కానీ, డామినిక్ సిబ్లీ(56), జాస్ బట్లర్ (46) రాణించడంతో జట్టు 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. తొలి టెస్టులో డబుల్ సెంచరీ(228), రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ(186)తో రాణించిన కెప్టెన్ జాయ్ రూట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.

సంక్షిప్త స్కోరు బోర్డు:

శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 381 ఆలౌట్
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 344 ఆలౌట్
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 126 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 164/4

Advertisement

Next Story