కాశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం

by Sumithra |
కాశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం
X

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. దియాలగామ్ ప్రాంతంలోని వాట్రీగామా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్టు నిఘా వర్గాల నుంచి సమచారం అందుకున్న భద్రతా దళాలు.. ఆదివారం తెల్లవారుజామున అక్కడకు చేరుకుని సోదాలు నిర్వహించాయి. అనంతనాగ్, అచల్‌బల్ సహ గ్రామంలోకి వెళ్లే మార్గాలను భద్రతాబలగాలు మూసివేసి.. ప్రతి ఒక్క ఇంటిలోనూ తనిఖీ చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమయిన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈఎన్‌కౌంటర్‌లో హతమైన ఒకరిని అనంతనాగ్ కు చెందిన హిజ్బుల్ ముజాయిద్దీన్ కమాండర్ తారీఖ్ అహ్మద్‌గా గుర్తించారు. మిగితా ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ దళాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నాయి. తొలుత ఈ ప్రాంతంలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు భావించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దియాల్‌గామ్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిందని పోలీస్ అధికారులు ప్రకటించారు.

tags; encounter in jammu kashmir,The murder of 4 terrorists, anantnag

Advertisement

Next Story