తగ్గిన బంగారు ఆభరణాల ఎగుమతులు

by Harish |
తగ్గిన బంగారు ఆభరణాల ఎగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది మేలో భారత రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 5 శాతం తగ్గాయని జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతినడంతో రత్నాలు, ఆభరణాల ఎగుమతుల విలువ రూ. 21,188 కోట్లుగా నమోదైంది. 2019 ఏడాది ఇదే సమయంలో వీటి ఎగుమతుల విలువ రూ. 21,388 కోట్లుగా ఉంది. వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు వల్ల కార్మిక సామర్థ్యం, సంబంధిత ఉత్పత్తి కార్యకలాపాలు క్షీణించాయని జీజేఈపీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

కరోనా మహమ్మారి సంబంధిత ఆంక్షల కారణంగా సింగపూర్, మలేషియా, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో పర్యాటకుల నుంచి అమ్మకాలు తగ్గిపోవడంతో మేలో బంగారు ఆభరణాల ఎగుమతులు దెబ్బతిన్నాయని జీజేఈపీసీ ఛైర్మన్ కొలిన్ షా వివరించారు. అయితే, డిజైనర్ బంగారు ఆభరణాల ఎగుమతులు 49 శాతం పెరిగి రూ. 3,985.46 కోట్లుగా నమోదయ్యాయని జీజేఈపీసీ వెల్లడించింది.

Advertisement

Next Story