- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్కార్ ఆర్డర్… కంప్లీట్ చేయకపోతే ఖతమేనంట!
దిశ, న్యూస్ బ్యూరో: ఐకేపీ ఉద్యోగులు వేతనాలు రాక, కరోనా బారిన పడుతూ అష్టకష్టాలు పడుతున్నారు. కొవిడ్ భయంకర పరిస్థితుల్లోనూ పని చేయించుకుంటున్న ప్రభుత్వం వేతనాలను మాత్రం పెండింగ్లో పెట్టింది. జూన్ నెల వేతనాలను పూర్తిగా నిలిపి వేశారు. ఇప్పటికే ఐకేపీ ప్రధాన కార్యాలయంతోపాటుగా జిల్లా కార్యాలయాల్లో పలువురికి కరోనా సోకింది. పదుల సంఖ్యలో ఉద్యోగులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారందరితో కాంటాక్టులో ఉన్న బ్యాంకుల సిబ్బంది, వందలాది మహిళలలకు కరోనా భయం పట్టుకుంది. ఐకేపీ ఉద్యోగుల కోసం ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తోంది. ఈసారి మాత్రం రెండు నెలలకు బడ్జెట్ ఇచ్చింది. ఆర్థిక శాఖ దానిని పెండింగ్లో ఉంచింది. సెర్ప్ పరిధిలో మొత్తం 4,254 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడంతోపాటు వారికి కరోనా అవగాహన కల్పించడానికి రోజువారీ విధుల్లో ఉంటున్నారు. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇస్తే జీతాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. మహిళా సంఘాల సమావేశాలు కొనసాగిస్తే, మహిళా సంఘాల సభ్యులతో పాటు ఉద్యోగులకు కూడా గండంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 47.6 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం ఈ సమయంలో కూడా సంఘాల ఆడిట్ నిర్వహించాలని, జూలై నెలాఖరు వరకు ఆడిట్ పూర్త కాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
ఐకేపీలో కరోనా బాధితులు
సెర్ప్ ప్రధాన కార్యాలయంలో ఒక ఏపీఎం, కన్సల్టెంట్‌కు పాజిటివ్ వచ్చింది. వీరితోపాటుగా మరో ముగ్గురికి శనివారం పాజిటివ్ రావడంతో కార్యాలయాన్ని మూసివేసి శానిటైజ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో సీబీఓ ఆడిటర్, ఫారుఖ్‌నగర్ సీసీ, మండల సమాఖ్య అకౌంటెంట్ కరోనాబారిన పడగా, మరో సీసీకి పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఫలితాలు రాలేదు. కామారెడ్డి జిల్లా లింగంపేట సీసీకి పాజిటివ్‌గా తేలింది. మహబూబాబాద్ జిల్లాలో ఏపీడీగా పని చేస్తున్న సీనియర్ సెర్ప్ ఉద్యోగికి పాజిటివ్ వచ్చింది. ఈ జిల్లాలో ఐదుగురు ఉద్యోగులు బ్యాంకు లింకేజీ డీపీఎం, హెచ్ఆర్ ఏపీఎం, డీఆర్‌డీఏ అటెండర్, మహబూబాబాద్ ఏపీఎం, సీసీకి కరోనా పాజిటివ్ వచ్చింది. మెదక్ జిల్లా మెదక్ మండలం సీసీకి, శివంపేట మండల సీసీకి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. సదరు సీసీ మూడు రోజులుగా మహిళా సంఘాలతో కలిసి తిరిగారు. వారందరూ కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. నారాయణపేట జిల్లాలో మఖ్తల్ ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్‌కు పాజిటివ్ వచ్చింది. మహిళా సంఘాల రుణాల వెరిఫికేషన్ సమయంలో వీరికి కరోనా సోకినట్లు గుర్తించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం కొమ్మగూడెం వీఓఏకి పాజిటివ్ వచ్చింది. వీఓఏతో బ్యాంకు వెళ్లిన 10 మంది సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. కరీంనగర్ డీఆర్డీఏ కార్యాలయంలో సోషల్ ఆడిటర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో అటెండర్‌కు కరోనా తేలింది.
రుణాలకు ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా కరోనా రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇప్పటి వరకు దాదాపు 11 లక్షల మందికి ఇప్పించారు. ఇంకా 30 లక్షలకు టార్గెట్ విధించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కరోనా రుణాల కోసం మహిళలు పెద్ద సంఖ్యలో రావడంతో బ్యాంకు మేనేజర్ పోలీసులను పిలిపించారు. అక్కడ విధులు నిర్వర్తించిన ఇద్దరు కానిస్టేబుళ్లకు పాజిటివ్ వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలానికి చెందిన ఒక సీసీకి కరోనా లక్షణాలు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో వీఓఏకు పాజిటివ్ వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో ఓ బ్యాంకు మేనేజర్‌కు పాజిటివ్ వచ్చింది. ఇలా రాష్ట్రంలోని నలుమూలలా ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు కరోనా బారిన పడుతున్నారు. ఇదే సమయంలో 47 లక్షల మంది మహిళలను సంఘాల అడిట్ పేరుతో సుదీర్ఘంగా సమావేశాలు ఏర్పాటు చేసి కలువాలని, అడిట్ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని 50 లక్షల కుటుంబాలు ఆందోళన బాటలో పడుతున్నారు. కరోనా రుణాలు ఆన్‌లైన్‌లో చేస్తున్నా దీనిపై సెర్ప్ లోని ఓ ఉన్నతాధికారి జారీ చేసిన ఆదేశాలు వారికి మరింత భయం పట్టుకునేలా చేస్తోంది. ప్రస్తుతం ఆగస్టు మొదటి వారంలో సిబ్బంది మొత్తం ప్రతి సంఘ సభ్యురాలి దగ్గరకు వెళ్లి నాలుగైదు గంటలు కూర్చుని పూర్త సమాచారం సేకరించాలని హుకూం జారీ చేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఈవో లేడు… జీతం లేదు
రాష్ట్రంలో అతిపెద్ద వ్యవస్థగా పేరొందిన ఐకేపీకి ఆరు నెలలుగా సీఈవో కూడా లేకపోవడం విడ్డూరం. పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. ఆడ్మిన్ డైరెక్టర్, ఐబీ డెరెక్టర్, నాన్ ఫామ్ డైరెక్టర్ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. సీఈవో లేకపోవడం, ఫైనాన్స్ లో బిల్లులు క్లియరెన్స్ కాకపోవడంతో వేతనాలు సైతం ఆగిపోయాయి. వేతనాల అంశంలో పట్టించుకోనే వారు లేరు. దీనిపై రోజువారీగా ఉద్యోగ సంఘాలు అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రస్తుత సమయంలో స్వశక్తి సంఘాల సమావేశాలను, ఇతర ముఖాముఖి సమావేశాలను రద్దు చేయాలని ఐకేపీ జేఏసీ ప్రభుత్వానికి విన్నవించింది. ఆన్‌లైన్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహించాలని, వేతనాలు వెంటనే ఖాతాల్లో జమ చేయాలని జేఏసీ ప్రతినిధులు కుంట గంగాధర్ రెడ్డి, ఏపూరి నర్సయ్య, సుభాష్, మహేందర్ రెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. సిబ్బందికి రోటేషన్ పద్దితిలో విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని, వీలైనంత వరకు ఆన్‌లైన్ ద్వారా వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని, 20 ఏండ్ల అనుభవం ఉన్న ఐకేపీ సిబ్బందికి ఆన్‌లైన్ ద్వారా పని చేస్తూ ప్రభుత్వం విధించిన టార్గెట్ పూర్తి చేసే సామర్థ్యం ఉందని ప్రభుత్వానికి రాసిన లేఖలో వివరించారు.