సర్కార్‌‌ను కూల్చివేస్తాం.. సీఎం జగన్‌కు ఉద్యోగుల సీరియస్ వార్నింగ్

by Anukaran |   ( Updated:2021-12-05 22:44:33.0  )
jagan
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసరావు జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు తలచుకుంటే ప్రభుత్వాన్ని తేగలరనీ అలాగే ప్రభుత్వాన్ని కూల్చేయగలరని హెచ్చరించారు. రాష్ట్రంలో మొత్తం 13 లక్షల మంది ఉద్యోగులున్నారని, ఒక్కో కుటుంబంలో ఐదుగురు సభ్యులున్నారు అనుకున్నా, మొత్తం ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిపి 60 లక్షల ఓట్లు ఉంటాయని తెలిపారు. ‘నేను ఉన్నాను, నేను విన్నాను’ అన్న జగన్ మాయమాటలు నమ్మి 151 సీట్లు ఇచ్చామనీ, కానీ అధికారంలోకి వచ్చాక తమ వైపు చూడడమే లేదన్నారు.

గతంలో ఐదు డీఏలను ఇవ్వకుండా ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబుకు ఉద్యోగుల సంగతి బాగా తెలుసని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలో మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులూ చచ్చిపోయే ముందు వెలిగే దీపంలా మిణుకు మిణుకు అంటున్నాయన్నారు. రైతుల దీక్షతోనే ప్రధాని మోడీ దిగి వచ్చారనీ, రేపు ఏపీలోనూ ఉద్యోగుల ఓట్లతో ప్రభుత్వాన్ని కూల్చివేయగలమని బండి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకటో తేదీన జీతం అందుకోవడం అనేది ఉద్యోగుల హక్కు అని బండి అన్నారు. జీతం సమయానికి రాక ప్రభుత్వ ఉద్యోగులు పాలు, కూరగాయల వాళ్ల దగ్గర చులకన అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రేపటి నుంచి ఆందోళన ఉధృతం..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి ఈ నెల 7 నుంచి ఉద్యోగుల శంఖారావం పేరుతో ఆందోళనలను తీవ్రతరం చేయనున్నామని అమరావతి జేఏసీ ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ముద్రించిన కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. ఈనెల 7న అనంతపురం నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రకటించారు. తాము దాచుకున్న రూ.1600 కోట్లను ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లినా సరైన సమాధానం లేదని దుయ్యబట్టారు. పీఆర్సీ అమలు, సీపీఎస్‌ రద్దుతో పాటు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని.. ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చకపోవడం వల్లే ఉద్యోగులమంతా రోడ్ల మీదకు వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం మొదలయ్యేలోగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీ జేఏసీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ 13 లక్షల ఉద్యోగులను సమాయత్త పరిచేందుకు కార్యక్రమాలను చేపట్టామన్నారు. 2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయలేదన్నారు. ఇప్పటి వరకు పీఆర్సీ రిపోర్టు బయటపెట్టలేదని, 7 పెండింగ్ డీఏలను నిలుపుదల చేసిన రాష్ట్రం ఏదీ లేదన్నారు. డీఏ బకాయులను ఇవ్వని ఏకైక సర్కార్ ఏపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని ఆందోళనను కొనసాగిస్తామని విద్యాసాగర్‌ స్పష్టం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయడం సహా పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed