ప్రమోషన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు

by Anukaran |
ప్రమోషన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: స్వరాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పదోన్నతుల ప్రక్రియ లేకపోవటంతో ఏడేళ్లుగా ఎదురు చూపులు తప్పడం లేదు. అన్ని స్థాయిల్లో అధికారుల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీలుండటంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కరువైంది. సర్వీసు రూల్స్ విషయంలో సుప్రీంకోర్టులో కేసుతో కొలిక్కి రాకపోవటం, జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేసినా రెండు కొత్త జిల్లాలతో మళ్లీ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి రావటంతో ఈ దుస్థితి దాపురించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మండలం నుంచి జిల్లా స్థాయి వరకు 90 శాతానికిపైగా పోస్టులు ఖాళీగా ఉండటం విద్యాశాఖ దురవస్థకు అద్దం పడుతోంది. జిల్లా స్థాయిలో కీలకంగా వ్యవహరించే డీఈవోలు లేకపోవటంతో విద్యా వ్యవస్థ పూర్తిగా పర్యవేక్షణ లేకుండా పోయింది. జిల్లా స్థాయి పోస్టులకు కూడా ఏడీలు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్1, లెక్చరర్లు, ప్రొఫెసర్లు అదనపు బాధ్యతలు నిర్వర్తించడం బాధాకరం. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా 21 డీఈవో పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. ఏడుగురు రెగ్యులర్ డీఈవోలుండగా 26 జిల్లాలకు అదనపు బాధ్యతలతో పని చేస్తున్నారు. డిప్యూటీ ఈవోల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. 66 పోస్టులకు ఆరుగురు మాత్రమే పని చేస్తున్నారు. 18 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్1 పోస్టులకు ఒక్కరు మాత్రమే రెగ్యులర్ ఉన్నారు.

డైట్, జూనియర్ కాలేజీల్లోనూ అదే దుస్థితి

రాష్ట్రంలో పది డైట్ కళాశాలలు, రెండు సబ్ డైట్ కళాశాలున్నాయి. వీటిలో 286 పోస్టులకు 21పోస్టులే భర్తీ అయ్యాయి. పది ప్రిన్సిపాల్ పోస్టులకు నలుగురే ఉన్నారు. 70 మంది సీనియర్ లెక్చరర్ల పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. తెలుగు మీడియంలో 166 లెక్చరర్ పోస్టులకు 14మంది పని చేస్తున్నారు. ఉర్దూ మీడియంలో 40 పోస్టులకు ముగ్గురే ఉన్నారు. ప్రభుత్వ బీఈడీ కాలేజీలు, ఉపాధ్యాయ, వ్యాయామ విద్య, దృశ్య, శ్రవణ విద్యకు సంబంధించిన కాలేజీల్లో 138 పోస్టులకు మూడు పోస్టులే భర్తీ చేశారు. జూనియర్ కాలేజీలకు సంబంధించి కూడా పదోన్నతులు లేకపోవటంతో సుమారు మూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 15,584 ఎస్జీటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్​ చేయాలి. 12210 స్కూల్ అసిస్టెంట్, 2206 పీఈటీ, 3555 లాంగ్వేజ్ పండిట్ టీచర్ పోస్టులు క్రియేట్ చేయాల్సి ఉంది.

ఏడేళ్లుగా తప్పని ఎదురుచూపులు

రాష్ట్రావిర్భావం తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపట్టలేదు. కొత్తగా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. దానికి సర్వీస్ రూల్స్ అనే కారణం చెబుతుండగా, సుప్రీంకోర్టులో కేసు ఉండటంతో కొలిక్కి రాలేదు. తాజాగా జోనల్ వ్యవస్థ కూడా కొత్త కారణంగా మారింది. జిల్లాల పునర్విభజన సమయంలో 10 జిల్లాలను 31జిల్లాలుగా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని జోనల్ వ్యవస్థ రద్దు చేసి కొత్తది ఏర్పాటు చేశారు. దానికి రాష్ట్రపతి ఆమోద ఉత్తర్వులు వెలువడ్డాయి. తర్వాత ములుగు, నారాయణపేట జిల్లాలు ఏర్పాటు చేయగా జిల్లాల సంఖ్య 33కి చేరింది. దీంతో మళ్లీ జోనల్ వ్యవస్థలో మార్పులు చేసి రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. ఒక ఎస్జీటీ ఉపాధ్యాయుడు 30 నుంచి 35 ఏళ్ల తన సర్వీసు మొత్తంలో గరిష్టంగా రెండుకు మించి పదోన్నతులు పొందటం లేదు. అదే, ఇతర శాఖలు, విద్యాశాఖలోని మినిస్టీరియల్ సిబ్బంది తమ సర్వీసులో పదోన్నతులతో 5 నుంచి 6 అంచెలు ఎదుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.50లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తుంటే వారిని పర్యవేక్షించే డిప్యూటీ డీఈవో, డీఈవోగా ఉపాధ్యాయ వర్గం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవటం పరిస్థితి తీవ్రతకు, ఉపాధ్యాయుల దుస్థితికి అద్దం పడుతోంది.

Advertisement

Next Story

Most Viewed