ఏడేళ్ల తర్వాత మళ్లీ రోడ్డెక్కుతున్నారు..!

by Anukaran |
ఏడేళ్ల తర్వాత మళ్లీ రోడ్డెక్కుతున్నారు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగ వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. ఏండ్ల తరబడి ఎదురుచూసిన ఉద్యోగులు ఇప్పుడు పీఆర్సీ కోసం నిరసనలకు దిగేందుకే సిద్ధమయ్యాయి. మరోవైపు ఉద్యోగ జేఏసీ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో.. కొన్ని సంఘాలు ఒక్కటవుతున్నాయి. శనివారం ఉద్యోగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనలకు దిగారు. పోలీసులు అరెస్ట్ చేసినా.. విడతల వారీగా రోడ్లపై బైఠాయించారు. ఇక ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పీఆర్సీ ప్రకటిస్తారని ఉద్యోగులు మరో ఆశ పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే పీఆర్సీ నివేదికపై సీఎం కేసీఆర్ అధ్యయనం చేశారని, ఉన్నతస్థాయి చర్చలు కూడా చేశారని, ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారని ఉద్యోగ జేఏసీ నేతలు చెబుతున్నారు.

పీఆర్సీ అంశంలో ఆలస్యం చేస్తూనే ఉన్నారు. ఈ నెల రెండో వారంలోనే పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలంటూ సీఎం కేసీఆర్ సూచించారు. కానీ సీఎస్​ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ వేతన సవరణ కమిషన్​ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదికనే ఓపెన్ చేయడం లేదని విమర్శలున్నాయి. వాస్తవంగా డిసెంబర్​30న కమిషన్ నివేదికను సీఎస్‌కు అప్పగించింది. దీనిపై ఈ నెల 6 లేదా 7న సమావేశం కావాలని సీఎం సూచించిన విషయం తెలిసిందే. కానీ కమిషన్ నివేదికను త్రిసభ్య కమిటీ అధ్యయనం చేయలేదు. ఉద్యోగ సంఘాలను పిలవలేదు. అయితే సీఎం కేసీఆర్‌కే నివేదికను ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

ఇక చర్చలుండవా..?

ఫిట్‌మెంట్ ఖరారు, నగదు రూపంలో అమలు అంశాలన్నీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించాలని సీఎం ఆదేశించినా.. ఉద్యోగ నేతలను మాత్రం పిలవడం లేదు. కొన్ని సందర్భాల్లో జేఏసీ నేతలు వెళ్లి సీఎస్‌ను అడిగి వస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ దగ్గరే ఉందంటూ అధికారులు సమాధానమిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫిట్‌మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇంత ఆలస్యం చేస్తున్నారంటే ఇక ఉద్యోగులతో చర్చలు ఉండవా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వచ్చేనెల మొదటివారంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్​వస్తుందని అధికార పార్టీ నేతలను అలర్ట్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగవర్గాలు చెబుతూనే ఉన్నాయి. ఈ నెల దాటితే వచ్చే నెల నుంచి ఎన్నికల వాతావరణం, కోడ్ ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక పీఆర్సీ అంశంపై శనివారం నిరాహార దీక్ష చేపట్టింది. ఇందిరాపార్కు దగ్గర దీక్షకు ఉద్యోగ సంఘాల నేతలు వస్తున్న సమయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరిపై ఐక్య వేదిక నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. ఐక్యవేదిక నాయకులు చిలగాని సంపత్ కుమారస్వామి, సదానందం‌గౌడ్‌, చావా రవి తదితరులను అరెస్ట్​చేశారు. అనంతరం తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.పి.పురుషోత్తం ఆధ్వర్యంలో ఉద్యోగులు రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. పీఆర్సీపై ఎటూ తేల్చకుండా కాలయాపన చేస్తున్నారని, దీక్ష చేసే ఉద్యోగులపై పోలీసులు జులుం ప్రదర్శించారంటూ టీఈఏ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

Advertisement

Next Story