- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటల ‘బీజేపీ’ ఎంట్రీపై ఎమోషనల్ చర్చ..
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ప్రగతిశీల భావజాలంతో ఎదిగిన ఈటల రాజేందర్ జాతీయ వాదం, హిందుత్వ నినాదం పల్లవిని ఎత్తుకోగల్గుతారా.? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లెఫ్టిస్ట్‌గా రాజకీయ ఓనమాలు దిద్దుకున్న ఈటల.. డెడ్ అగెనెస్ట్ అయిన రైటిస్ట్ పార్టీ పంచన చేరుతుండటంపై ఇంటా బయటా చర్చలు మొదలయ్యాయి.
బీజేపీలో డిస్కషన్..
సిద్దాంతం విషయంలో రాజీ పడని బీజేపీలోకి ఆయనను ఆహ్వానించడం పట్ల సీనియర్లు ఇబ్బందిగా ఫీలవుతున్నట్టు సమాచారం. అంతర్మథనంలో పడ్డ బీజేపీ, దాని అనుబంధ సంఘాల బాధ్యులు ఈటలను చేర్చుకోవడం వల్ల పార్టీకి ఎంత వరకు లాభం ఉంటుందో అర్థం కావడం లేదంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈటలను పార్టీలో చేర్పించుకోవడం అవసరమని నాయకత్వం భావించడం సరికాదన్న అభిప్రాయాలే వ్యక్తం చేస్తున్నారు.
‘జై శ్రీరామ్’ అన్న నినాదం వినిపించే బీజేపీని విమర్శించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. దేవరయాంజల్ భూములు ఆలయానికి చెందినవి కావడం వల్ల ఇతర పార్టీలు అడ్వంటేజ్ తీసుకుంటాయని అంటున్న వారూ లేకపోలేదు. ఇంటా బయటా వ్యతిరేకత వస్తుందని కొందరు బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. హుజురాబాద్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి.. ఈటల చేరికను బాహాటంగానే వ్యతిరేకించారు. చివరకు డీకే అరుణ రంగంలోకి దిగి పెద్దిరెడ్డిని బుజ్జగించారు.
ఈటలపైనా..
ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం వల్ల బడుగు బలహీన వర్గాల్లోను పెదవి విరుస్తున్న వారూ లేకపోలేదు. ఆయన తటస్థంగా ఉన్నా బాగుండేది.. కానీ బీజేపీలో చేరడం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నవారు చాలామందే ఉన్నారు. విద్యార్థి ఉద్యమాల కోసం పీడీఎస్‌యూలో పని చేసిన రాజేందర్.. స్వరాష్ట్ర కల సాకారం కోసం ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్‌లో పని చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సిద్దాంత పరంగా పూర్తి వ్యతిరేకమైన కమలం గూటికి చేరుతుండటంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారే ఎక్కువ.
వలసలు షురూ..
రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఇలా ఉంటే.. ఆయన సొంత నియోజకవర్గంలో కూడా వ్యతిరేకిస్తున్న వారూ లేకపోలేదు. ఇప్పటికే బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్, స్వతంత్రంగా గెలిచి బీజేపీలో చేరిన మరో కౌన్సిలర్ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. జమ్మికుంటకు చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు కూడా గులాబీ జెండాకు జై కొట్టారు. అంతేకాకుండా హుజురాబాద్ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న బీజేపీ నాయకులకు కూడా.. ఇది మింగుడు పడకుండా తయారైంది. ఈటల చేరిక తర్వాత పార్టీ బలోపేతం అవుతుందా.? లేదా అన్నది అటు ఉంచితే.. ఆదిలోనే కమలనాథుల్లో వ్యతిరేకత వచ్చిందన్నది మాత్రం వాస్తవం.