అవును.. అలా చేయడం మా తప్పే : రాహుల్ గాంధీ

by Shamantha N |
అవును.. అలా చేయడం మా తప్పే : రాహుల్ గాంధీ
X

న్యూఢిల్లీ: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని, దశాబ్దాల వారసత్వ పాలనను మార్చిన నిర్ణయంపై ఇప్పటికీ సమాధానాలు చెప్పుకోలేక తంటాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ అంతర్మథనంలో పడిందా..? ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, గాంధీల వారసుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పరిశీలిస్తే అదే విషయం అనిపించకమానదు. 1975 లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) తమ పార్టీ చేసిన తప్పేనని ఆయన ఒప్పుకున్నారు. ఇన్నాళ్లు ఈ విషయంపై మాట్లాడాలంటేనే కాంగ్రెస్ గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ పెద్దల దాకా మీడియా నుంచి దూరంగా వెళ్లిపోయేవారు. కానీ స్వయంగా గాంధీల వారసుడే ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆర్థిక వేత్త, భారత మాజీ ముఖ్య సలహాదారు కౌశిక్ బసుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా రాహుల్ గాంధీ పై వ్యాఖ్యలు చేశారు. రాహుల్ స్పందిస్తూ.. ‘అవును, అది తప్పు. కచ్చితంగా మా తప్పే. ఈ విషయం మా నాన్నమ్మ (ఇందిరాగాంధీ) కు తర్వాత కాలంలో అర్థమైంది’ అని అన్నారు. అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మాదిరిగా అప్పుడు లేదనీ, దేశ మౌళిక వ్యవస్థలను కూల్చే ప్రయత్నం తామెప్పుడూ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. అంత శక్తి కూడా తమ పార్టీకి లేదని రాహుల్ చెప్పుకొచ్చారు.

కానీ ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ నేత‌ృత్వంలో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఒకవేళ తాము బీజేపీని ఓడించినా.. దేశ రాజ్యాంగ వ్యవస్థలలో పాతుకుపోయిన ఆర్ఎస్ఎస్ శక్తులను తొలగించలేమని అన్నారు. మధ్యప్రదేశ్ లో పూర్తి మెజారిటీతో ఉన్న తమ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం అక్కడి ప్రభుత్వ వ్యవస్థలలో మొత్తం ఆరెస్సెస్ వ్యక్తులే నిండిపోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తాను కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం తమిళనాడు, పాండిచ్చేరిలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. విరామ సమయంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed