రైతు ఆవేదన పట్టించుకోరా.. మామిడి చెట్లు నరికేసిన కరెంటోళ్లు

by Sridhar Babu |
రైతు ఆవేదన పట్టించుకోరా.. మామిడి చెట్లు నరికేసిన కరెంటోళ్లు
X

దిశ, ధర్మారం: ఏ శాఖ వారైనా పనులు చేసే ముందు సంబంధిత రైతులకు సమాచారం ఇచ్చి అనుకూలంగా ఉన్నప్పుడే పనులు చేపడుతారు. అలాంటిది ఎలాంటి సమాచారం లేకుండా వైర్లకు చెట్లు అడ్డుగా వస్తాయోమోనని అడ్డంగా నరికేశారు కరెంటోళ్లు.

వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో మాదాసు చంద్రయ్య అనే రైతుకు 2 ఎకరాల మామిడి తోట ఉంది. అందులో నుండి గత మూడు సంవత్సరాల క్రితం మేడారం నుండి రామడుగు మండలం లక్ష్మీపూర్ పంప్ హౌస్‌కు 400 కేవీ లైన్ వేశారు. కాగా గత 15 రోజుల క్రితం విద్యుత్ శాఖ అధికారులు ఫోన్ చేసి, మీ మామిడి చెట్లు వైర్లకు అడ్డు వస్తున్నాయని, కొంచెం కొమ్మలు మాత్రేమే కొట్టివేస్తామని సమాచారం ఇచ్చారు. ఇందుకు రైతు చంద్రయ్య ఒప్పుకోలేదు. నాకు నష్టపరిహారం ఇవ్వకుండా చెట్లను ముట్టాకూడదని బదులిచ్చాడు. దీంతో కొద్ది రోజులు సైలెంట్ అయిన విద్యుత్ శాఖ అధికారులు గత మూడు రోజుల క్రితం చంద్రయ్యకు ఇలాంటి సమాచారం లేకుండానే నాలుగు మామిడి చెట్లను మొదటికే నరికారు.

పక్క రైతు ద్వారా సమాచారం అందుకున్న చంద్రయ్య హడావిడిగా తోట వద్దకు వెళ్లేసరికి చంద్రయ్యను గమనించి వారు అక్కడి నుండి వెళ్లిపోయినట్టు రైతు తెలిపాడు. ఈ సంఘటనతో రైతు కన్నీరు మున్నీరు అయ్యాడు. తన ఒక్కో చెట్టు సంవత్సరానికి 20 వేల రూపాయల ఆదాయం ఇస్తుందని నాలుగు చెట్లు సంవత్సరానికి 80 వేల ఆదాయం తెచ్చిపెడుతాయని ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ శాఖ అధికారులు నరికేసిన చెట్లు ఇంకా 20 సంవత్సరాలు కాపు కాస్తాయని 20 సంవత్సరాలకు 16 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని తెలియపరుస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్‎కు వినతిపత్రం అందజేసినట్లు చంద్రయ్య తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed