కరోనా చీకట్లలో 'కరెంటోళ్ల’ వెలుగులు

by vinod kumar |
కరోనా చీకట్లలో కరెంటోళ్ల’ వెలుగులు
X

దిశ, న్యూస్ బ్యూరో:
కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ‘లాక్‌డౌన్’లో భాగంగా ప్రజలంతా ‘స్టే హోమ్ స్టే సేఫ్’ నినాదంతో ఇళ్లకే పరిమితమయ్యారు. వైద్యసిబ్బంది, పారిశుద్య కార్మికులు, పోలీసులు కరోనా కట్టడిలో కీలక భూమిక పోషిస్తున్నారు. అందుకే ఈ మూడు రంగాలను మూడు సింహాలుగా ప్రజలు భావిస్తున్నారు. కానీ ఇళ్ళకే పరిమితమైన ప్రజలకు రెప్పపాటు కరెంటు పోకుండా ఆవిశ్రాంతంగా కృషి చేస్తున్న కరెంటు సిబ్బంది కష్టాలు తెరమీదకు రావడంలేదు. అసలే వేసవికాలం… ఒక్క క్షణం కరెంటు పోతే ఇళ్ళల్లో పడే బాధలు వర్ణనాతీతం. కానీ ప్రజలకు సుఖాన్నిస్తూ కరెంటోళ్ళు కష్టాలను అనుభవిస్తున్నారు. ఒకవైపు చేతికొచ్చిన పంటలకు 24 గంటలూ మోటారు పంపుసెట్ల కోసం కరెంటు.. మరోవైపు ఇళ్ళల్లో లైట్లు, ఫ్యాన్‌లు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు, మొబైల్ ఛార్జింగ్‌లు, వైఫై.. ఇలాంటి అవసరాలకు నిరంతరం కరెంటు సరఫరా చేయాల్సి వస్తోంది. అయితే కరెంటోళ్ళు పడుతున్న కష్టాలు ఎక్కడా బైటకు కనిపించదు. అందుకే విద్యుత్ సిబ్బంది కంటికి కనిపించని నాల్గవ సింహం.

ముఖ్యమంత్రి ఆదేశం మేరకు జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ మార్గదర్శకత్వంలో ఇంజనీర్ మొదలు కరెంటు స్థంభం ఎక్కే కార్మికుడి వరకు యావత్తు విద్యుత్ సిబ్బంది ఏం కష్టపడుతున్నారో బైట ప్రపంచానికి తెలిసే అవకాశమే లేదు. ప్రధాని ఇచ్చిన ‘దీపం వెలిగించండి’ పిలుపుకు ఒక్కసారిగా ప్రజలంతా లైట్లు ఆర్పివేస్తే గ్రిడ్ వ్యవస్థ దెబ్బతింటుందన్న ఆందోళన దేశవ్యాప్తంగా తలెత్తింది. కానీ అలాంటి సవాలును సైతం అధిగమించడంలో విద్యుత్ వ్యవస్థ విజయవంతమైంది. ఇందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో, ఏమేం ఏర్పాట్లు చేసుకున్నారో దేశ ప్రజలకు తెలియదు. ఆ తొమ్మిది నిమిషాల కోసం కొన్ని గంటలపాటు విద్యుత్ సిబ్బంది క్షణం తీరిక లేకుండా ఏర్పాట్లలో మునిగిపోయారు. ఏమవుతుందోననే ఆందోళనతో క్షణమొక యుగంగా గడిపారు. సీఎండీ, డిస్కంల సీఎండీలు, ఇంజనీర్ల సమన్వయం, సమిష్టి కృషితో తెలంగాణ విద్యుత్ వ్యవస్థ సక్సెస్ సాధించింది.

రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలోని సుమారు 50 వేల మంది సిబ్బంది ఆరు లక్షల కి.మీ. విద్యుత్ లైన్లను, 350 ఈహెచ్‌టి సబ్‌స్టేషన్లను, 33 సామర్ధ్యం కలిగిన మూడు వేల సబ్‌స్టేషన్లను, ట్రాన్స్‌ఫార్మర్లను సమన్వయించుకుంటూ సుమారు 24 లక్షల వ్యవసాయ మోటారు పంపుసెట్లకు, కాళేశ్వరం ప్రాజెక్టు పంపులకు, గృహాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తున్నారు. సుమారు కోటి మందికిపైగా ఉన్న విద్యుత్ వినియోగదారులకు రెప్పపాటు కరెంటు పోకుండా చూడగలిగారు. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు మూతపడడంతో భారీ స్థాయిలో డిస్కంలు నష్టాలను చవిచూస్తున్నాయి. గృహ వినియోగానికి సంబంధించి కూడా బిల్లుల ద్వారా ఏ మేరకు ఆదాయం వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి. అయినా విద్యుత్ వ్యవస్థ మాత్రం ఎక్కడా దెబ్బతినకుండా పనిచేస్తూనే ఉంది.

మూడు సింహాలైన వైద్య, పారిశుద్య, పోలీసుల గురించి ముఖ్యమంత్రి ఇటీవల చాలా సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. ప్రత్యేక పారితోషికాన్ని ప్రకటించారు. జీతాల్లో కోతను ఎత్తివేశారు. కానీ విద్యుత్ కార్మికుల కృషిని ప్రస్తావించకపోవడం వీరిని ఒకింత నిరుత్సాహానికి గురిచేసింది. అత్యవసర సేవల్లో ఒకటైనా జీతంలో కోత పెట్టడంతో బాధపడ్డారు. అయితే ఇతర ఉద్యోగులతో పోలిస్తే ఎక్కువ జీతాలు ఉండడం, ఇంక్రిమెంట్ ప్రకటించడం, పల్లె ప్రగతి-పట్టణ ప్రగతి సందర్భంగా ఆ శాఖ ఉద్యోగులను ప్రశంసించడం ద్వారా వారిలో ఏర్పడిన ఉత్సాహమే ఇప్పుడు వారిని నడిపిస్తోంది. జీతాల్లో కోత లేకుండా ఉన్నట్లయితే మరింత సంతోషంగా ఉండేవారమని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు కోల్పోయినదాన్ని మళ్ళీ తొందర్లోనే సీఎం నోటి వెంట ఏదో ఒక ప్రోత్సాహకాన్ని వింటామన్న ఆశ వారిలో వ్యక్తమవుతోంది.

మూడు షిఫ్టుల్లో ఫీల్డ్ సిబ్బంది..

అత్యవసర సర్వీసుల క్యాటగిరీలోకి వచ్చే విద్యుత్ శాఖ కావడంతో యావత్తు సిబ్బంది ‘లాక్‌డౌన్’లోనూ ఎప్పటిలాగే విధులు నిర్వహిస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చి విద్యుత్ సరఫరా ఆగిపోయినా వెంటనే సరఫరా పునరుద్ధరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రబీలో రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న దిగుబడి రానుందని సీఎం కేసీఆరే స్వయంగా చెప్పారు. బోర్ల మీద, లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆధారపడి సాగయ్యే పంటలకు ఇబ్బంది రావద్దని విద్యుత్ శాఖను ఆదేశించారు. దానికి తగ్గట్లుగానే జనతా కర్ఫ్యూ మొదలు ఇప్పటివరకు ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చూడగలిగారు. ప్రజలంతా ఫ్యాన్ గాలిలో ఉన్నా విద్యుత్ కార్మికులు మాత్రం ఎండ, వానను లెక్కచేయకుండా ఫీల్డ్ మీద సేవలందిస్తున్నారు.

ఇళ్లకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా నిరంతరం జరగాలంటే ఫీల్డ్ లెవెల్ సిబ్బంది రోజులో 3 షిఫ్టులు పనిచేయక తప్పదు. విద్యుత్ పంపిణీలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించకా తప్పదు. రాష్ట్రంలోని దక్షిణ, ఉత్తర డిస్కమ్‌లలో సుమారు 50 వేల మంది పని చేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది ఫీల్డ్ మీదనే పనిచేస్తారు. డిప్యూటీ ఇంజనీర్ మొదలు ఏడీఈ, ఏఈ, లైన్ ఇన్స్ పెక్టర్, లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్, ఆర్టిజన్స్‌ ఇలా అన్ని స్థాయిల్లోని సిబ్బంది లక్ష్యం నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయడమే. ఇళ్లకు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా జరగడంలో వీరిదే కీలక పాత్ర. ఎక్కడ కరెంటు పోయినా 24 గంటలపాటు 3 షిఫ్టుల్లో పనిచేసే వీరు అక్కడ వాలి పరిస్థితిని అదుపులోకి తెస్తారు. ఇక విద్యుత్ ఉత్పత్తి (జెన్‌కో)లో సైతం వీరి కృషి తెరచాటునే ఉండిపోతుంది. ప్రజలకు కనిపించేలా ‘విజిబుల్‌’గా ఉండదు.

పనిలో సంతృప్తే మాకు వెన్నుదన్ను : శ్రీనివాస్

”కరోనాను తరిమేయడంలో వైద్య, పారిశుద్య, పోలీసు శాఖల లాగానే మాది కూడా అత్యవసర సర్వీసు కిందకు వచ్చేదే. శాఖలో ఉద్యోగుల స్థాయికి అతీతంగా పై నుంచి కింది వరకు సమిష్టి కృషి తప్పదు. ముఖ్యమంత్రి ప్రోత్సాహం, యాజమాన్యం మార్గదర్శకత్వం మాకు రెండు కళ్ళు లాంటివి. కరోనా కారణంగా కొన్నిసార్లు గ్రామాల్లోని ప్రజలు మమ్మల్ని రానిచ్చేవారుకాదు. మేం కరెంటోళ్ళమని వాళ్ళకు తెలియదు కూడా. మేం సేవ చేస్తున్నదే మీ కోసం అంటూ వారికి అర్థం చేయించాం. కొన్నిసార్లు స్థానికంగా ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకున్నాం. కరోనాను తరిమికొట్టడంలో మా వంతు పాత్రను మేం పోషిస్తున్నాం. రోడ్లమీద తిరిగేటప్పుడు పోలీసులతోనూ మాకు ఇబ్బంది వచ్చింది. అయితే మా సీఎండీ నుంచే పాస్‌ల విధానంతో పాటు పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో మా విధులకు ఆటంకం లేకుండాపోయింది. రెప్పపాటు కరెంటు పోకుండా చూడగలిగామన్న మా పనితీరే మాకు సంతృప్తినిచ్చింది” అని అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

మేం కష్టపడుతూ ప్రజలను సుఖపెడుతున్నాం : అంజయ్య

”కరోనాలో మా పాత్ర బైటకు కనిపించకపోవచ్చు. కానీ వైద్యులు, నర్సులు ఆసుపత్రుల్లో పేషెంట్లకు చికిత్స చేస్తున్నారంటే మేమిచ్చే విద్యుత్ వల్లనే సాధ్యమవుతోంది. ఒక్క క్షణం కరెంటు పోతే ఆసుపత్రుల్లోని వార్డుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘లాక్‌డౌన్”లో ఇళ్ళకే పరిమితమైన మొత్తం కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. కరెంటు పోతే ఎండాకాలంలో ఎన్ని కష్టాలో మనకు తెలియంది కాదు. కానీ వారికి ఆ కష్టం లేకుండా చేయడానికి మేం కష్టపడుతున్నాం. మాకు కూడా కరోనా భయం ఉండనే ఉంది. కానీ మేం ఇంట్లో ఉండలేం. రోడ్డెక్కాల్సిందే. అందుకే మా జాగ్రత్తలు మేం తీసుకుంటున్నాం. మా కృషికి అదనపు అలవెన్సును, ఇన్సెంటివ్‌ను ఆశించలేదుగానీ పూర్తి జీతం వస్తే బాగుండేదని చాలా మంది ఉద్యోగులు అనుకున్నారు. కానీ ఐఏఎస్‌ల దగ్గరి నుంచి అందరి ఉద్యోగాలకూ కోత ఉన్నట్లే మాకూ తప్పలేదని అర్థం చేసుకున్నాం. మా కృషికి సీఎండీ, సీఎం నుంచి తీపి కబురు వస్తుందనే ఆశ పుష్కలంగా ఉంది” అని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అంజయ్య వ్యాఖ్యానించారు.

నిజమే… మేం కనిపించని సింహమే : శివాజీ

”కరోనాపై యుద్ధం చేస్తున్న క్రమంలో విద్యుత్ సిబ్బంది పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రజలు సుఖంగా ఉన్నారంటే విద్యుత్ కార్మికులు కష్టపడుతున్నారనే అర్థం. తెలంగాణలో కరెంటు కష్టాలు ప్రతీ ఒక్కరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆ కష్టాలు లేవు. కరోనా కూడా మమ్మల్ని ఏమీ చేయలేకపోయింది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం లోడ్ డిస్పాచ్ సెంటర్‌లో 31 మంది ఉద్యోగులు 24 గంటలూ పనిచేస్తున్నారు. ఇళ్ళకు కూడా వెళ్ళకుండా అక్కడే ఉంటున్నారు. ముఖ్యమంత్రి, సీఎండీ మాకు అప్పగించిన బాధ్యతను నీరుగార్చరాదనే పట్టుదలతో పనిచేస్తున్నాం. ‘లాక్‌డౌన్’తో ఇళ్ళకే పరిమితమైన ప్రజలు ఇబ్బంది పడకుండా కరెంటును నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం. ఇది విద్యుత్ శాఖలో అందరి సమన్వయంతో సాధ్యమైన సమిష్టి కృషి. మాకు అప్పజెప్పిన టాస్క్‌ను దిగ్విజయంగా పూర్తిచేస్తున్నాం. సీఎం, సీఎండీ ప్రశంసలే మాకు దీవెనలు. కానీ వారు అప్పజెప్పిన విధులను పట్టుదలతో నిర్వర్తిస్తున్నాం” అని విద్యుత్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శివాజీ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story